Andhra Pradesh: ఉత్తరాంధ్రలో కొత్త వైరస్‌ అలజడి

  • విశాఖలో ప్రతీ నలుగురిలో ఒకరికి లక్షణాలు
  • జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరుతున్న బాధితులు
  • ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో పెరుగుతున్న కేసులు
  • ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన అధికారులు
Andhra Pradesh health dept sounds alert on Influenza virus H3N2

దేశంలో ఇప్పుడు వైరస్ భయం వణికిస్తోంది.. హెచ్3ఎన్2 వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో జనం ఆందోళన చెందుతున్నారు. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే దేశంలో ఇద్దరు చనిపోవడం ఈ ఆందోళనను మరింత పెంచుతోంది. ఉత్తరాంధ్రలో కూడా ఈ వైరస్ లక్షణాలతో ఆసుపత్రులలో చేరుతున్న కేసులు పెరుగుతున్నాయి. విశాఖపట్నంలో ప్రతీ నలుగురిలో ఒకరు జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వస్తున్న బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయి. దీంతో వైద్యాధికారులు అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. గతంలో హెచ్1ఎన్1 వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది.. దానికి సంబంధించిన సాధారణ వేరియంటే హెచ్3 ఎన్2. ఈ వైరస్ కారణంగా శుక్రవారం కర్ణాటకలో ఒకరు, హర్యానాలో మరొకరు చనిపోయారని అధికారులు తెలిపారు. ఈ వైరస్ బయటపడ్డ తర్వాత నమోదైన తొలి మరణం ఇదేనని వివరించారు. దేశమంతా ఇదే పరిస్థితి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. కేసులు పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేసింది.

వాతావరణంలో మార్పులతో పాటు రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించకపోవడం వల్ల హెచ్3ఎన్2 వైరస్ కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా తరహాలోనే వ్యాపించే ఈ వైరస్.. బాధితుల తుంపర్ల ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి అంటుకుంటుందని తెలిపారు. వైరస్ బాధితులలో వారం రోజుల పాటు లక్షణాలు కనిపిస్తాయని వివరించారు. మద్యపానం, పొగతాగే అలవాటు ఉన్న వారితో పాటు వృద్ధులు, పిల్లలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు.

More Telugu News