Bangladesh: వివాదాల కెప్టెన్.. అభిమానిపై ఈసారి టోపీతో దాడి చేసిన బంగ్లాదేశ్ స్కిప్పర్!

Bangladesh Skipper Shakib Al Hasan Beats Fan With Cape
  • వాణిజ్య కార్యక్రమంలో ఘటన
  • టోపీ తీసుకునేందుకు ప్రయత్నించిన అభిమాని
  • అదే టోపీతో ఆగకుండా దాడి
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన బంగ్లాదేశ్ టెస్ట్, టీ20 కెప్టెన్ షకీబల్ హసన్ మరోమారు వార్తల్లోకి ఎక్కాడు. ఓ ప్రమోషనల్ కార్యక్రమంలో సహనం కోల్పోయి అభిమానిని టోపీతో పదేపదే కొట్టాడు. రెండు రోజుల క్రితం చాటోగ్రామ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 అనంతరం ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 

మ్యాచ్ ముగిసిన మూడు గంటల తర్వాత షకీబల్ ఓ వాణిజ్య ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ కార్యక్రమానికి అభిమానులు పోటెత్తారు. ఇంగ్లండ్‌పై తమ ప్రదర్శన గురించి షకీబల్ అక్కడ మాట్లాడాడు. కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ కారు వద్దకు వెళ్లేందుకు షకీబ్ ఇబ్బంది పడ్డాడు. అభిమానులు చుట్టుముట్టడంతో అసౌకర్యానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఓ అభిమాని షకీబల్ నుంచి టోపీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన బంగ్లా కెప్టెన్ టోపీతో అభిమానిపై ఆగకుండా పలుమార్లు కొట్టాడు. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాలకు ఎక్కడంతో షకీబల్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిజానికి షకీబల్‌కు వివాదాలు కొత్తకాదు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2023 సందర్భంగా ఓ వైడ్ బాల్ విషయంలో అంపైర్‌తో గొడవ పడ్డాడు. అంతకుముందు 2021లో ఇదే లీగ్ సందర్భంగా కోపంతో వికెట్లను తన్నిపడేశాడు. ఫిక్సింగ్ కోసం కొందరు బుకీలు సంప్రదించిన విషయం అపెక్స్ బోర్డుకు తెలియజేయనందుకు ఐసీసీ 2019లో అతడిని రెండేళ్లపాటు నిషేధించింది. 

 వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Bangladesh
Shakib Al Hasan
Shakib Beats Fan

More Telugu News