Sunil Gavaskar: ఆస్ట్రేలియా మీడియా, మాజీలకు సునీల్ గవాస్కర్ వార్నింగ్

Sunil Gavaskar Slams Australian Media And Ex Cricketers
  • భారత్ లో పిచ్ లపై అతి చేస్తున్నారన్న సన్నీ
  • తమ నిజాయతీని అనుమానించేలా వ్యాఖ్యలు చేస్తే ఊరుకోనన్న దిగ్గజ క్రికెటర్
  • వికెట్లపై ప్రస్తుత ఆటగాళ్లు ఏమీ అనడం లేదన్న గవాస్కర్ 
భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో పిచ్ ల విషయంలో ఆస్ట్రేలియా మీడియా, ఆ దేశ మాజీ క్రికెటర్లు చేస్తున్న అతిపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఆసీస్ మాజీ ఆటగాళ్లు రుచిలేని వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ సిరీస్‌లో ఉపయోగించిన వికెట్ల గురించి ఆసీస్ మాజీలు రాద్ధాంతం చేస్తుండగా, ఆ దేశ మీడియా ప్రతికూల కథనాలు రాస్తోంది. నాగ్‌పూర్ పిచ్‌ను ప్రమాదకరం, నాసిరకం అనడం, టీమిండియా తమకు నచ్చినట్టు పిచ్ ను మార్పించుకుందని ఆరోపించడంపై గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. దేశ నిజాయతీని, చిత్తశుద్ధిని అనుమానిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించాడు. 
 
‘వాస్తవానికి స్టీవ్ స్మిత్ భారత్‌లో ఆడటం, మరియు కెప్టెన్‌గా వ్యవహరించడం చాలా బాగుందని చెప్పాడు. ఎందుకంటే ఈ సిరీస్ లో బ్యాటర్ ఎదుర్కొనే ప్రతి బంతి ఒక సవాలు. ప్రతి ఓవర్ ఆట గమనాన్ని మార్చగలదు. వికెట్ల గురించి ప్రస్తుత ఆస్ట్రేలియా ఆటగాళ్ళు ఏమీ అనడం లేదు. కానీ ఆ దేశ మాజీ ఆటగాళ్లే అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. అది కాస్త కలవరపరిచేదిగా ఉంది. 75 ఏళ్ల భారత్-ఆస్ట్రేలియా మధ్య స్నేహం నవ శకంలోకి అడుగుపెడుతున్న ఈ సమయంలో ఆస్ట్రేలియాకు చెందిన కొందరు మాజీ ఆటగాళ్లు రుచించని పదాలను ఉపయోగించాల్సింది కాదు’ అని గవాస్కర్  అభిప్రాయపడ్డాడు. 
 
పిచ్ అనేది ఇరు జట్లకూ ఓకేలా ఉంటుందని, రెండు జట్ల ఆటగాళ్లకు వేర్వేరు సందర్భాల్లో అనుకూలిస్తుందన్న విషయాన్ని గుర్తు చేశాడు. ‘రెండు జట్లకూ పిచ్ ఒకేలా ఉంది. మీరు విదేశీ పర్యటనకు వచ్చి మీ దేశంలో మాదిరి పిచ్‌లు ఉండవన్న వాస్తవాన్ని గ్రహించి వాటిపై ఆడండి. అంతే తప్ప భారతీయుల నిజాయతీని శంకించే పదాలు ఉపయోగించవద్దు. నేను భారతీయుడిగా గర్వపడతా. ఎవరైనా భారతీయులపై, నాపై అనుమానం వ్యక్తం చేస్తే నేను కచ్చితంగా స్పందిస్తా. నా అభిప్రాయాన్ని చెబుతా’ అని సన్నీ స్పష్టం చేశాడు.
Sunil Gavaskar
Australia
Team India
media
Ex Cricketers
pictch

More Telugu News