K Kavitha: అవి ఈడీ నోటీసులు కావు.. మోదీ నోటీసులు: ఎన్డీటీవీతో కవిత

They are not ED summons they are Modi summons says Kavitha
  • లిక్కర్ స్కామ్ లో కవితకు ఈడీ నోటీసులు
  • ఈడీ సమన్స్ కు, మోదీ సమన్స్ కు తేడా లేదన్న కవిత
  • తన తండ్రి కేసీఆర్ ను బీజేపీ టార్గెట్ చేసిందని ఆరోపణ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి నిన్ననే ఆమె విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ... ఆమె విజ్ఞప్తి మేరకు రేపు (11వ తేదీ) హాజరయ్యేందుకు ఈడీ అనుమతినిచ్చింది. మరోవైపు జాతీయ మీడియా ఎన్డీటీవీతో కవిత మాట్లాడుతూ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. తనకు వచ్చినవి ఈడీ నోటీసులు కావని, మోదీ నోటీసులని దుయ్యబట్టారు. తాను ఏ తప్పూ చేయలేదని నిరూపించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. 

ఇండియాలో మోదీ సమన్స్ కు, ఈడీ సమన్స్ కు తేడా లేదని కవిత అన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు ఉన్నా మోదీ కంటే ముందు ఈడీ వస్తుందని ఎద్దేవా చేశారు. ప్రజాకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు కానీ వెళ్లడమే విపక్షాలు చేయాల్సిన పని అని అన్నారు. తెలంగాణలో వరుసగా మూడోసారి అధికారంలోకి రాబోతున్న తన తండ్రిని బీజేపీ టార్గెట్ చేసిందని విమర్శించారు. తప్పు చేసిన వారు భయపడతారని... తాను తప్పు చేయలేదని అన్నారు. మరోవైపు చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాసేపట్లో కవిత దీక్షను ప్రారంభించబోతున్నారు.
K Kavitha
BRS
Delhi Liquor Scam

More Telugu News