New Delhi: అందుకే కేజ్రీవాల్ ను నేరస్థుడిగా చూస్తున్నారు: జైలు నుంచి సిసోడియా బహిరంగ లేఖ

Politics of jail vs politics of education in Manish Sisodia letter from prison
  • నాయకులు మంచి పాఠశాలలు, కళాశాలలు ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్న
  • విద్యా రాజకీయం కంటే జైలు రాజకీయం చేయడం సులువంటూ బీజేపీపై పరోక్ష విమర్శలు
  • మోదీ శైలిని సవాల్ చేసే కొత్త రాజకీయాన్ని ప్రవేశపెట్టినందుకేనన్న సిసోడియా
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్టయిన ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైలు నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు. అధికారంలో ఉన్న నాయకులు దేశంలోని యువత కోసం అద్భుతమైన పాఠశాలలు, కళాశాలలను ఎందుకు స్థాపించలేదని ఆయన ప్రశ్నించారు. విద్యకు చాలా ప్రాముఖ్యత ఉన్నప్పటికీ, దాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ‘రాజకీయ నాయకులు విద్య కోసం తమ వనరులను, శక్తిని వెచ్చించి ఉంటే, మన దేశంలోని ప్రతి బిడ్డకు అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా నాణ్యమైన పాఠశాలలు అందుబాటులో ఉండేవి’ అని లేఖలో పేర్కొన్నారు. 

రాజకీయ నాయకులు జైళ్లు నడుపుతూ విజయం సాధిస్తున్నారని, విద్యకు మాత్రం తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని పరోక్షంగా బీజేపీని ఎద్దేవా చేశారు. ‘అరవింద్ కేజ్రీవాల్ ను నేరస్థుడిగా పరిగణించడానికి కారణం, మోదీ వ్యవహారశైలిని సవాలు చేసే కొత్త రాజకీయాన్ని ప్రవేశపెట్టడమే. ఫలితంగా కేజ్రీవాల్ ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు ప్రస్తుతం జైలు పాలయ్యారు. జైలు రాజకీయాలు పాలక నాయకుడి శక్తిని పెంచుతాయి. అయితే, విద్యా రాజకీయాలు దేశానికి అధికారం ఇస్తాయి. నాయకుడికి కాదు’ అని పేర్కొన్నారు. కుటుంబ నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించి బాధ్యతాయుతమైన పౌరుడిగా మారితే దేశం పురోగమిస్తుందని సిసోడియా చెప్పారు. 

‘అదృష్టవశాత్తూ ఈ స్వేచ్ఛా కాలంలో, దేశం రెండు విభిన్న రాజకీయ విధానాలను కలిగి ఉంది. ఒకటి జైలు రాజకీయాలు. మరోటి విద్యా రాజకీయాలు. వ్యక్తిగతంగా నాయకుడికి ఏ విధానం ప్రయోజనం చేకూరుస్తుందో, మొత్తం దేశానికి ఏది ప్రయోజనం చేకూరుస్తుందో ప్రజలకు స్పష్టంగా తెలుసు’ అని లేఖలో రాశారు.  జైలు రాజకీయాల మాదిరిగా కాకుండా విద్యా రాజకీయాలు ఒక సవాలుతో కూడుకున్న పని అని అభిప్రాయపడ్డారు. జైలు రాజకీయాల్లో విజయం సాధించడం నాయకులకు ఎల్లప్పుడూ సులభమని ఆయన అన్నారు.
New Delhi
Manish Sisodia
letter
jail
Delhi Liquor Scam
Arvind Kejriwal
AAP

More Telugu News