Nara Lokesh: 500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న లోకేశ్ పాదయాత్ర

  • జనవరి 27న కుప్పంలో లోకేశ్ పాదయాత్ర ప్రారంభం
  • ఇప్పటివరకు 12 నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి
  • ప్రస్తుతం మదనపల్లి నియోజకవర్గంలో యువగళం
  • సగటున రోజుకు 13 కిలోమీటర్లు నడుస్తున్న లోకేశ్
Lokesh completes 500 km in Yuvagalam Padayatra

టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర మదనపల్లి రూరల్ చిన తిమ్మసముద్రం-2 వద్ద ఇవాళ 500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా లోకేశ్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లోకేశ్ మాట్లాడుతూ... టీడీపీ అధికారంలోకి వచ్చాక మదనపల్లి నియోజకవర్గంలో ట‌మోటా రైతుల కోసం ట‌మోటా ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్‌స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 

నేడు లోకేశ్ పాదయాత్రకు 39వ రోజు. కుప్పంలో జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర ఇప్పటివరకు 12 నియోజకవర్గాల్లో పూర్తయి, ప్రస్తుతం మదనపల్లి నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు లోకేశ్ ప్రతిరోజు సగటున 13 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేశారు. రోజుకు 10 కిలోమీటర్ల చొప్పున నడవాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా, నిర్ణీత లక్ష్యాని కంటే సగటున 3 కిలోమీటర్లు అధికంగా నడిచారు. 

మాటలు కోటలు సరే... మెడికల్ కాలేజ్ నిర్మాణం ఎప్పుడు జగన్?

మదనపల్లి రూరల్ ఆరోగ్యవరంలోని మెడికల్ కాలేజి నిర్మాణ ప్రాంతాన్ని లోకేశ్ పాదయాత్ర దారిలో పరిశీలించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జగన్... నీ మాటలు కోటలు దాటుతున్నాయి... పనులు మాత్రం గడప దాటడంలేదు అని విమర్శించారు. 

"2021 మే 31న నువ్వు వర్చువల్ గా, పాపాల పెద్దిరెడ్డి స్వయంగా వచ్చి పునాది రాయి వేసి 475 కోట్ల రూపాయలతో 30 నెలల్లో పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికారు కదా? ఎప్పుడు పనులు మొదలు పెడతారు? ఇంకెప్పుడు అడ్మిషన్లు మొదలుపెడతారు? రోగులకు సేవలు అందిస్తారో కాస్త చెప్తారా ప్లీజ్... లేదంటే నిన్న సవాల్ విసిరిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారూ మీరైనా చెప్పండి" అంటూ వ్యాఖ్యానించారు.

జైహింద్ అన్న యువకుడు... లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

సభలో ప్రశ్న అడిగి జై హింద్ అన్న ముస్లిం యువకుడితో మాట్లాడుతూ లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "మైనార్టీల సభలో జై హింద్ అన్నానని వైసీపీ వాళ్ళు నన్ను ట్రోల్ చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు మైనార్టీలను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారు. దేశంలో పుట్టి, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అయిన మైనార్టీలు జై హింద్ అంటే తప్పేంటి?. దేశం తరువాతే ఏదైనా. దేశ భక్తిని కూడా తప్పు బట్టే నీచమైన వాళ్ళు వైసీపీ వాళ్ళు. బీజేపీతో రెండున్నర ఏళ్ళు పొత్తులో ఉన్నా ఏనాడూ మైనార్టీలపై టీడీపీ హయాంలో దాడులు జరగలేదు. మీ నిధులు పక్కదారి పట్టించలేదు" అని లోకేశ్ స్పష్టం చేశారు.

ఫిష్ ఆంధ్రా కాదు... ఫినిష్ ఆంధ్ర‌!

చిన తిప్పసముద్రంలో తాళాలు వేసి ఉన్న ఫిష్ ఆంధ్ర మార్ట్ వద్ద లోకేశ్ సెల్ఫీ దిగి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పాద‌యాత్రలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తెచ్చిన కంపెనీలు చూస్తుంటే క‌ళ్లు బైర్లు క‌మ్ముతున్నాయని వ్యంగ్యం ప్రదర్శించారు. 

"మొన్ననే దేశంలో ఎక్కడా దొర‌క‌ని స‌రుకు జ‌గ‌న్ రెడ్డి త‌యారు చేసే బూమ్ బూమ్‌, ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడ‌ల్ లోడు మీకు చూపించాను. ఈ రోజు మ‌రో జ‌గ‌న్ మానస పుత్రిక అనదగ్గ మరో పథకం 'ఫిష్ ఆంధ్ర' చూశాను. మ‌ద‌న‌ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గం చిన్న తిప్పస‌ముద్రంలో జ‌గ‌న్ తెచ్చిన ఫిష్ ఆంధ్ర మార్ట్ కి తాళాలు ప‌డి ఫినిష్ అయిపోయింది. రాయ‌ల‌సీమ‌ని మేము ఎల‌క్ట్రానిక్స్‌-మాన్యుఫ్యాక్చరింగ్ హ‌బ్‌గా తీర్చిదిద్దితే, జ‌గ‌న్‌రెడ్డి ఫిష్ మార్టులు తెచ్చాడు. చేప‌ల్లేక‌, అద్దెలు క‌ట్టక అవి ఫినిష్ కూడా అయిపోయాయి. అభివృద్ధి అంటే రంగులు వేసుకోవ‌డం కాదు జ‌గ‌న్" అంటూ లోకేష్ చురకలు అంటించారు.

*యువగళం పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన దూరం కి.మీ. 510.5 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం – 13.0 కి.మీ.*

*యువగళం పాదయాత్ర 40వ రోజు షెడ్యూల్ (10-3-2023)*

*మదనపల్లి నియోజకవర్గం*

ఉదయం

9.00 – మదనపల్లి రూరల్ దేవతానగర్ క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

9.15 – మదనపల్లి 6వ వార్డులో స్థానికులతో మాటామంతీ.

9.50 – మదనపల్లి బర్మా సర్కిల్ లో స్థానికులతో భేటీ.

10.15 – టౌన్ బ్యాంకు సర్కిల్ లో విశ్వబ్రాహ్మణులతో సమావేశం.

10.40 – బెంగుళూరు బస్టాండు సర్కిల్ లో ముస్లిం పెద్దలతో సమావేశం.

11.00 – అనిబిసెంట్ సర్కిల్ లో విద్యార్థులతో భేటీ.

11.25 – ఎన్టీఆర్ సర్కిల్ లో స్థానికులతో మాటామంతీ.

మధ్యాహ్నం

12.15 – 34వ వార్డు నీరుగట్టువారిపల్లిలో భోజన విరామం.

*సాయంత్రం*

3.30 – నీరుగట్టివారిపల్లి నుంచి పాదయాత్ర కొనసాగింపు.

4.00 – టికెఎన్ వెంచర్ అన్నమయ్య నగర్ బహిరంగసభలో యువనేత ప్రసంగం.

5.30 – తంబళ్లపల్లి నియోజకవర్గంలో యువనేత లోకేష్ ప్రవేశం.

6.30 – తంబళ్లపల్లి నియోజకవర్గం నందిరెడ్డివారిపల్లి చేనేతనగర్ విడిది కేంద్రంలో బస.

*********








More Telugu News