Ramcharan: హాలీవుడ్ డైరెక్ట‌ర్స్‌ని ప్రేమ‌తో ఛాలెంజ్ చేయాల‌నుకుంటున్నాను: చ‌ర‌ణ్‌

  • 'నాటు నాటు' సాంగ్ గురించి ప్రస్తావించిన చరణ్
  • 17 రోజుల పాటు ఆ పాటను చిత్రీకరించారని వెల్లడి 
  • రాజమౌళి తన పనిలో నిష్ణాతుడు అంటూ కితాబు 
  • హాలీవుడ్ స్టార్స్ గురించి ప్రస్తావన 
  • 'ఆర్ ఆర్ ఆర్' ఆశించినదానికి మించి అభినందనలు తెచ్చిందని వ్యాఖ్య
Ramcharan Interview

ఎంట‌ర్‌టైన్‌మెంట్ టు నైట్ ప్రోగ్రామ్ హోస్ట్ యాష్ క్రాస‌న్ ఆదివారం జ‌ర‌గ‌బోయే ఆస్కార్ ఈవెంట్ కోసం మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ను ఇంట‌ర్వ్యూ చేశారు. ఈ సంద‌ర్భంగా ‘నాటు నాటు’ పాట సాధించిన ఘ‌న‌త గురించి చ‌ర‌ణ్ ప్ర‌స్తావించారు. అలాగే  ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళితో వ‌ర్క్ చేయ‌టం త‌న‌కెలాంటి అనుభూతినిస్తుందో కూడా ఆయ‌న వివ‌రించారు. 

- ఇదే ఇంట‌ర్వ్యూలో మ‌న వెర్స‌టైల్ యాక్ష‌న్ హీరో చ‌ర‌ణ్ ఆస్కార్ ఈవెంట్‌లో పాల్గొనాలనుకునే సెల‌బ్రిటీల పేర్లను వెల్ల‌డించారు. త‌న‌కెంతో ఇష్ట‌మైన, ప్ర‌పంచ ప్ర‌సిద్ధి చెందిన ఇద్ద‌రు ఫిల్మ్ మేక‌ర్స్ పేర్ల‌ను తెలియజేశారు. ఇంటర్వ్యూలో చరణ్ ఇంకా ఏమేం మాట్లాడారంటే..

- ‘నాటు నాటు’ సాంగ్ కేవలం RRR మూవీలోని పాట మాత్రమే కాదు. ఇది అంద‌రి పాట‌. ప్ర‌జ‌లంద‌రూ మెచ్చిన పాట‌. భిన్న సంస్కృతుల‌కు చెందిన వేర్వేరు వ‌య‌సుల‌కు చెందిన‌వారు పాట‌లోని సాహిత్యం అర్థం కాన‌ప్ప‌టికీ త‌మ పాట‌గా స్వీక‌రించారు. పాట బీట్ అంద‌రూ మెచ్చేలా ఉంది. జపాన్ నుంచి యు.ఎస్ వ‌ర‌కు ప్ర‌తీ ఒక్క‌రూ పాట‌ను ఇష్ట‌ప‌డ్డారు. ఇది ఎవ‌రూ కాద‌న‌లేని నిజం. ఇంత కంటే గొప్ప‌గా ఏదీ కోరుకోను. 

- ఉక్రెయిన్‌లోని ప్రెసిడెంట్స్ ప్యాలెస్ ముందు వారం రోజుల పాటు 'నాటు నాటు' పాట‌ను రిహార్స‌ల్ చేశాం. అక్క‌డి ప్రెసిడెంట్ కూడా ఓ న‌టుడే. కాబ‌ట్టి ఆయ‌న అక్క‌డ షూటింగ్ చేసుకుంటామ‌నే మా అభ్య‌ర్థ‌న‌ను మ‌న్నించారు. పాట చిత్రీక‌ర‌ణ‌లో నూట యాబై మంది డాన్స‌ర్స్ సెట్‌లో పాల్గొన్నారు. ఇంకా 200 మంది యూనిట్ స‌భ్యులున్నారు. ఆ పాట‌ను చిత్రీక‌రించ‌టానికి 17 రోజుల స‌మయం ప‌ట్టింది. డాన్స్ చేసే క్ర‌మంలో చాలా రీటేక్స్ తీసుకున్నాం. నేనైతే నాలుగు కిలోల బ‌రువు త‌గ్గిపోయాను. ఆ కష్టం గురించి ఇప్పుడాలోచించినా నా కాళ్లు వ‌ణుకుతాయి. 

- నా నుంచి, నా స‌హ న‌టుడు (ఎన్టీఆర్‌) నుంచి ఎలాంటి ఔట్ పుట్ రావాల‌నే దానిపై మా ద‌ర్శ‌కుడు (ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి) చాలా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకునేవారు. మా డాన్స్ మూమెంట్స్ ల‌య బ‌ద్ధ‌త‌, ప్ర‌తీ ఫ్రేమ్ ప‌ర్‌ఫెక్ట్‌గా ఉండాల‌ని మా డైరెక్ట‌ర్ చాలా ప‌ర్టికుల‌ర్‌గా ఉండేవారు. ఆయ‌న ఆ స‌మ‌యంలో మ‌మ్మ‌ల్ని ఎంత హింస పెట్టినా దానికి త‌గ్గ ప్ర‌తిఫ‌లం ద‌క్కింది (న‌వ్వుతూ). నేను రాజ‌మౌళిగారితో ఎప్పుడు ప‌ని చేసిన నా బ్రెయిన్‌ని స్విచ్ ఆఫ్ మోడ్‌లో పెట్టేసుకుంటాను. ఎందుకంటే ఆయ‌న మ‌న‌సులో ఏముందో మ‌నం ఊహించ‌లేం. అలాగే ఆయ‌న ప‌నిలో ఆయ‌న చాలా నిష్ణాతుడు. ఓ టెక్నీషియ‌న్‌గా త‌న‌కేం కావాలో బాగా తెలుసు. 

- త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌బోతున్న ఆస్కార్ అవార్డ్స్ కార్య‌క్ర‌మం సంద‌ర్బంగా ఎగ్జ‌యిటెడ్‌గా ఉన్నాను. అలాగే తెలియ‌ని నెర్వ‌స్‌నెస్ ఉంది. ఓ న‌టుడిగా అక్క‌డ ఉంటానో లేక ఫ్యాన్ బాయ్‌గా ఉంటానో తెలియ‌టం లేదు. ఎందుకంటే నేను ఎవ‌రినైతే చూస్తూ పెరిగానో వారంద‌రినీ అక్క‌డ చూడ‌బోతున్నాను. కేట్ బ్లాంచెట్‌, టామ్ క్రూయిజ్‌ వంటి వారి సినిమాల‌ను చూస్తూ పెరిగాయి. టామ్ క్రూయిజ్ చాలా గొప్ప వ్య‌క్తి. ఆయ‌న‌తో క‌లిసి ప‌ని చేసే అవ‌కాశం వ‌స్తే చాలా గొప్ప‌. 

- ఆస్కార్ అవార్డుకి మా సంగీత ద‌ర్శ‌కులు ఎం.ఎం.కీర‌వాణిగారు అర్హులు. ఆయ‌న త‌న రంగంలో 27 ఏళ్లుగా ప‌య‌నిస్తున్నారు. ఇన్నేళ్ల‌కు ఆయ‌న‌కు ఆస్కార్ అవార్డ్ వ‌స్తుంది. కీర‌వాణిగారికి స‌పోర్ట్ చేయ‌టానికి ఓ కుటుంబంలాగా మేమంతా ఇక్క‌డ‌కు వ‌చ్చాం. - RRR గొప్ప క‌ళాత్మ‌క చిత్రం.. దీని ప‌రంగా మాకు ఆశించిన దాని కంటే ఎక్కువ ప్రేమ‌, అభినంద‌న‌లు ద‌క్కాయి. ఇప్పుడేదైతే ద‌క్కుతుందో అదంతా అద‌నం. మేం ఈ క్ష‌ణాల‌ను ఆస్వాదిస్తున్నాం. 

- భిన్న సంస్కృతులతో కూడిన ఆడియెన్స్ ఎంత‌గానో ఇష్ట‌ప‌డే ఫ్రాంచైజీ చిత్రాల్లో నేను భాగం కావాల‌నుకుంటున్నాను. ఇప్పుడు సినిమా గ్లోబ‌ల్ అయ్యింది. సినిమాకున్న హ‌ద్దుల‌న్నీ చెరిగిపోతున్నాయి. ఇలాంటి సినీ గ్లోబ‌లైజేష‌న్ స‌మ‌యంలో నేను సినీ ఇండ‌స్ట్రీలో ఉండ‌టం అదృష్టంగా భావిస్తున్నాను. 

- నేను హాలీవుడ్‌లో చాలా మంది ద‌ర్శ‌కుల‌తో క‌లిసి ప‌ని చేయాల‌నుకుంటున్నాను. వారిలో జె.జె.అబ్ర‌మ్స్ ఒక‌రు. క్వాంటిన్ ట‌రాన్‌టినో నాకు ఎంతో ఇష్ట‌మైన‌ది. ఆయ‌న డైరెక్ట్ చేసిన వార్ మూవీ ఇన్‌గ్లోరియ‌స్ బాస్టర్ట్స్ నా ఆల్ టైమ్ ఫేవ‌రేట్ మూవీ. ఆయ‌న నాపై ఎంతో ప్ర‌భావాన్ని చూపారు. ఈ ద‌ర్శ‌కులు వారితో ప‌ని చేసే న‌టుల‌కు స‌వాలు విసురుతుంటారు" అని చెప్పుకొచ్చారు.

More Telugu News