Vangalapudi Anitha: ఒకడు తథాస్తు అంటే, మరొకడు థాంక్యూ ఆంటీ అంటున్నాడు: అనిత

  • టీడీపీ నేత అనితపై ట్రోలింగ్
  • జగన్ కు అనుకూలంగా మాట్లాడిందని ప్రచారం
  • టీడీపీ షోకాజ్ నోటీసులు ఇచ్చిందని పోస్టులు
  • అంతా ఫేక్ అంటూ ఖండించిన టీడీపీ
  • తాను మాట్లాడిన మాటలు ఎడిట్ చేశారన్న అనిత
Anitha press meet on trolling

నారా లోకేశ్ పాదయాత్రలో టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత సీఎం జగన్ కు అనుకూలంగా మాట్లాడిందనీ, ఆమెకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు షోకాజ్ నోటీసులు జారీ చేశారనీ సోషల్ మీడియాలో ప్రచారం జరగడం తెలిసిందే. ఈ షోకాజ్ నోటీసులు ఫేక్ అని టీడీపీ ఇప్పటికే ఖండించింది. 

ఈ వ్యవహారంపై వంగలపూడి అనిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, లోకేశ్ సభలో తాను మాట్లాడిన వీడియోను ఎడిట్ చేశారని ఆరోపించారు. దాని ఆధారంగా విపరీతంగా ట్రోల్ చేశారని ఆమె తెలిపారు. జగన్ మళ్లీ సీఎం అవ్వాలని తాను కోరుకున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని, ఒకడు తథాస్తు అంటే, మరొకడు థ్యాంక్యూ ఆంటీ అంటూ ట్రోల్ చేశారని అనిత వెల్లడించారు. రాష్ట్రంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. 

తాను తెలుగు మహిళ అధ్యక్షురాలినని, ఒక మాజీ ఎమ్మెల్యేనని, అంతకుమించి ఒక దళిత బిడ్డనని, ఆడపిల్లనని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నేను మాట్లాడిన మాటలను కూడా ఎడిట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారంటే వీళ్లను మనుషులు అనాలా? లేక పశువులు అనాలా? అంటూ మండిపడ్డారు. 

జగన్ మళ్లీ సీఎం అవ్వాలనుకుంటే చేసిన మంచిపనులను సోషల్ మీడియాలో పెట్టుకోవాలని హితవు పలికారు. ఈ ట్రోలింగ్ గురించి సాక్షి చానల్లో కూడా వేసుకుని వారు ఆనందం పొందారంటే ఇంతకుమించి అబద్ధపు మీడియా సంస్థ ఉంటుందా? అని విమర్శించారు.

More Telugu News