Nani: ఎవరికీ రాని ఆలోచనలు రాజమౌళికి వస్తాయి: నాని ప్రశంసలు

nani praises director ss rajamouli and hopes naatu naatu wins oscar
  • ‘దసరా’ సినిమా ప్రమోషన్స్ లో ముంబైలో బిజీగా నాని
  • ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ రాజమౌళిపై పొగడ్తలు
  • భారతీయ సినిమా అనగానే అందరూ దక్షిణాదిని ఆయన చూసేలా చేశారని వ్యాఖ్య
  • ఆర్ఆర్ఆర్ లోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వస్తుందన్న న్యాచురల్ స్టార్
ప్రస్తుతం ‘దసరా’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు టాలీవుడ్ హీరో, న్యాచురల్ స్టార్ నాని. తొలిసారి పాన్ ఇండియా స్థాయిలో తన చిత్రాన్ని రిలీజ్ చేస్తుండటంతో ప్రచారం అంతా తానే అయి చూసుకుంటున్నారు. ముంబైలో మీడియా సంస్థలకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు.

భారతీయ సినిమా అనగానే అందరూ దక్షిణాదిని చూసేలా రాజమౌళి చేశారని నాని చెప్పారు. ఆయన అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలరని కొనియాడారు. షూటింగ్ సమయంలో ప్రతి సన్నివేశాన్ని ఎంతో పరిశీలిస్తారని, ఒక సీన్ ను వివరించే సమయంలో, దాన్ని రచించే సమయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారని చెప్పారు. ఎవరికీ రాని ఆలోచనలు రాజమౌళికి వస్తాయని, ఎవరూ చేయని పనులను ఆయన విజయవంతంగా పూర్తి చేస్తారని పొగడ్తల్లో ముంచెత్తారు.

ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు ఆస్కార్ వస్తుందని నాని అన్నారు. తెలుగు మాస్ పాట ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిందని, ఈ పాట ఆస్కార్ గెలుచుకుంటుందన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు. భారతీయ సినిమాలు ప్రత్యేకమైనవని, అన్ని విధాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నాయని, ‘నాటు నాటు’ కేవలం ప్రారంభం మాత్రమేనని చెప్పారు.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దసరా’. మార్చి 30న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. నాని పూర్తి మాస్ లుక్ లో ఇందులో నటిస్తున్నారు. హీరోయిన్ గా కీర్తి సురేశ్ నటిస్తోంది.
Nani
Rajamouli
naatu naatu
oscar for naatu naatu
RRR
Dasara

More Telugu News