Somu Veerraju: ఉద్యోగుల జీవితాలతో ఏపీ ప్రభుత్వం చెలగాటమాడుతోంది: సోము వీర్రాజు విమర్శలు

  • ఉద్యోగులను దొంగదెబ్బ కొట్టే ప్రయత్నం ఏపీ ప్రభుత్వం చేస్తోందన్న సోము వీర్రాజు
  • రోడ్డెక్కి ఉద్యమాలు చేసే పరిస్థితికి వారిని తీసుకొచ్చిందని విమర్శ
  • పోరాడి తమకు హక్కులను సాధించుకోవాలని పిలుపు
somu veerraju fires on ap govt over govt employees issue

ఉద్యోగుల జీవితాలతో ఏపీ ప్రభుత్వం చెలగాటమాడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ఉద్యోగులు రోడ్డెక్కి ఉద్యమాలు చేసే పరిస్థితికి తీసుకొచ్చిందని విమర్శించారు. సలహాదారులకు సకాలంలో జీతాలు ఇస్తున్న ప్రభుత్వం.. ఉద్యోగులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సలహాదారులకు జీతాలు, వాళ్ల విధులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

ఈ రోజు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులను దొంగదెబ్బ కొట్టే ప్రయత్నం ఏపీ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. జీతాలు వస్తే చాలు మహాభాగ్యం అనుకునే స్థాయికి ఉద్యోగులను తీసుకొచ్చిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కపట ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు. ఉద్యోగుల ఉద్యమానికి బీజేపీ మద్దతు ఉంటుందని, పోరాడి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. 

జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని సోము వీర్రాజు తెలిపారు. జనసేనతో బీజేపీ కాపురం బాగుందని, ఆ పార్టీ శ్రేణులు తమకే ఓటు వేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీతో కలిసి ఉంటామని పవన్ కల్యాణ్ గతంలోనే స్పష్టం చేశారని గుర్తు చేశారు.

దేవాదాయ శాఖను ఆదాయ వనరుగా ప్రభుత్వం మార్చేసిందని ఆయన ఆరోపించారు. టీటీడీ సహా ఇతర ఆలయాల్లో భారీగా రేట్లను పెంచేసి.. సామాన్యులను భగవంతుడికి దూరం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను, వ్యతిరేక ఓటును ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా మార్చుకుంటామని ధీమా వ్యక్తంచేశారు.

More Telugu News