KTR: అదానీ విషయంలో విచారణ ఎదుర్కొనే దమ్ము మోదీకి ఉందా?: కేటీఆర్

  • మోదీ బినామీ అదానీ అని చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారన్న కేటీఆర్
  • దేశంలో నీతిలేని పాలన, నిజాయతీ లేని దర్యాప్తు సంస్థలు ఉన్నాయని విమర్శలు
  • ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరవుతారని వెల్లడి
  • న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, మోదీకీ, ఈడీకీ భయపడేది లేదని వ్యాఖ్య
telangana minister ktr responds on ed summons to brs mlc kavitha on delhi liquor scam case

కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఎమ్మెల్సీ కవితకు ఇచ్చినవి ఈడీ సమన్లు కాదని, మోదీ సమన్లు అని విమర్శించారు. కేంద్రం చేతిలో దర్యాప్తు సంస్థలు కీలు బొమ్మలుగా మారాయని ఆరోపించారు. దేశమంతా అవినీతిపరులు.. తాము మాత్రం సత్యహరిశ్చంద్రుని కజిన్ బ్రదర్స్ అన్నట్లు బీజేపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతల మీద ఉన్న కేసులు ఏమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు.

ఈ రోజు తెలంగాణ భవన్‌లో మంత్రులతో కలిసి కేటీఆర్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ప్రధాని మోదీ బినామీ ఎవరని ప్రశ్నిస్తే అదానీ అని చిన్న పిల్లలు కూడా చెబుతారని ఆయన అన్నారు. ‘‘పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఎవరి బినామీ? ప్రధాని మోదీ బినామీ కాదా? ఎల్ఐసీ, ఎస్ బీఐకి చెందిన రూ.13 లక్షల కోట్లు మాయమైనా.. ప్రధాని గానీ, కేంద్ర ఆర్థిక మంత్రి గానీ స్పందించట్లేదు. గౌతమ్ అదానీకి 6 ఎయిర్ పోర్టులు ఇవ్వడం తప్పు కాదా? ముంద్రా పోర్టులో 21 వేల కోట్ల విలువైన హెరాయిన్ దొరికినా ఎందుకు చర్యలు తీసుకోలేదు?’’ అని ప్రశ్నించారు.

ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరవుతారని మంత్రి చెప్పారు. కవిత విషయంలో చట్టబద్ధంగా విచారణను ఎదుర్కొంటామని తెలిపారు. మరి గౌతమ్ అదానీ విషయంలో విచారణను ఎదుర్కొనే దమ్ము ప్రధాని మోదీకి ఉందా? అని ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని, మోదీకీ, ఈడీకీ భయపడేది లేదని స్పష్టంచేశారు. 10 మందికిపైగా బీఆర్ఎస్ నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు చేశారని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నేతలపై మరిన్ని దాడులు జరుగుతాయన్నారు. రాజకీయ వేధింపులను రాజకీయంగానే ఎదుర్కొంటామని చెప్పారు. 

మోసాలు, గారడీలు చేస్తున్నారంటూ కేటీఆర్ మండిపడ్డారు. ‘‘కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చాక.. 5,426 కేసులు పెట్టించి... 23 కేసుల్లో మాత్రమే దోషులుగా తేల్చారు. ప్రతిపక్షాలు లేకుండా చేసేందుకే ఇలా చేస్తున్నారు. దేశంలో నీతిలేని పాలన, నిజాయతీ లేని దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. ప్రతిపక్షాల మీద కేసుల దాడి, ప్రజల మీద ధరల దాడి చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. 

గుజరాత్‌లో లిక్కర్ తాగి 42 మంది చనిపోవడమే అసలైన లిక్కర్ స్కామ్ అని కేటీఆర్ అన్నారు. ‘‘మద్యమే లేని గుజరాత్ రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి 42 మంది చనిపోతే ఏ విచారణ చేశారు? ఢిల్లీ లిక్కర్ పాలసీని తప్పుబడుతున్న వారు.. గుజరాత్ లో జరిగిన ఘటనపై ఏ చర్యలు తీసుకున్నారు?’’ అని ప్రశ్నించారు.

More Telugu News