3 year baby death: మొక్కజొన్న గింజలు తింటూ.. మూడేళ్ల పాప మృతి

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామంలో విషాదం
  • శ్వాస ఆడక విలవిల్లాడిన పసికందు
  • ఆసుపత్రికి తరలించేలోపే ఆగిన చిన్నారి ఊపిరి
  • గుండెలవిసేలా రోదిస్తున్న తల్లిదండ్రులు
Baby Girl Died Due to Food Stuck in Lungs

మూడేళ్ల పాప మొక్కజొన్న గింజలు తింటూ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయింది. ఊపిరితిత్తుల్లోకి గింజలు చేరడంతో శ్వాస ఆడక విలవిల్లాడింది. కాసేపటికే కన్నుమూసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంచుపల్లి మండలం రాంపురంలో ఈ విషాదం చోటుచేసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురు ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.  

చుంచుపల్లి మండలంలోని రాంపురం గ్రామంలో కూలీ పనులు చేసుకుని జీవనం కొనసాగిస్తున్న బొల్లికొండ వెంకట కృష్ణ, అశ్విని దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె బిందుశ్రీ బుధవారం ఇంట్లో మొక్కజొన్నగింజలు తింటుండగా పొలమారింది. విపరీతంగా దగ్గురావడంతో మూడుసార్లు వాంతులు చేసుకుంది. ఈ క్రమంలోనే మొక్కజొన్న గింజలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లాయి. 

దీంతో శ్వాస ఆడక బిందుశ్రీ ఇబ్బంది పడింది. వెంటనే పాపను కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలలో పాప ఊపిరితిత్తుల్లో మొక్కజొన్న గింజలను గుర్తించిన వైద్యులు.. పాపకు వెంటనే బ్రాంకోస్కోప్‌ చేయాలని చెప్పారు. ఆ సదుపాయం ఖమ్మంలో లేకపోవడంతో పాపను వరంగల్‌ తరలించాలని సూచించారు. అందుకు ఏర్పాట్లు చేస్తుండగానే బిందుశ్రీ ప్రాణాలు విడిచింది.

More Telugu News