Andhra Pradesh: వైజాగ్ నుంచి గోవా.. ఇక 2 గంటలలోపు ప్రయాణమే!

  • డైరెక్ట్ సర్వీసులు నడుపుతున్నట్టు ఇండిగో ప్రకటన
  • ఈ నెలాఖరు నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడి
  • వారంలో మూడు రోజులపాటు అందుబాటులో ఫ్లైట్లు
IndiGo Airlines to operate direct flights between Visakhapatnam and Goa thrice a week

గోవా వెళ్లి సరదాగా సేదతీరాలనుకునే ఆంధ్రప్రదేశ్ వాసులకు ఇండిగో ఎయిర్ లైన్స్ గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖపట్నం నుంచి గోవాకు నేరుగా విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెలాఖరు నుంచే సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో రెండు గంటల్లోనే గోవాకు చేరుకోవచ్చని ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, విజయవాడ సిటీల నుంచి గోవా వెళ్లాలంటే చాలా సమయం పడుతోంది. ఈ రెండు సిటీల నుంచి విమానంలో గోవాకు వెళ్లొచ్చు.. అయితే, అవేవీ డైరెక్ట్ సర్వీసులు కావు. వైజాగ్ లేదా విజయవాడలో విమానం ఎక్కి, హైదరాబాద్ లేదా బెంగళూరులో మరో విమానంలోకి మారి గోవాకు చేరుకోవాల్సిందే.

హైదరాబాద్ లేదా బెంగళూరులో ఇంటర్ కనెక్ట్ ఫ్లైట్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంటోంది. దీంతో రెండు గంటల విమాన ప్రయాణానికి మూడు గంటల నుంచి పది గంటల దాకా సమయం పడుతోంది. దూరం తక్కువే అయినా నేరుగా సర్వీసులు లేకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పట్లేదు. ఈ నేపథ్యంలో వైజాగ్ నుంచి గోవాకు నేరుగా విమానాలు నడపనున్నట్లు ఇండిగో ఎయిర్ లైన్స్ తాజాగా ప్రకటించింది.

ఈ నెల 28 నుంచి సర్వీసులు ప్రారంభిస్తామని, వారంలో మూడు రోజులు నేరుగా గోవాకు ఫ్లైట్లు ఉంటాయని చెప్పింది. ప్రతీ మంగళ, గురు, శనివారాలలో నార్త్ గోవా ఎయిర్‌పోర్ట్ నుంచి మధ్యాహ్నం 3.40 గంటలకు ఫ్లైట్ బయల్దేరుతుందని, సాయంత్రం 5.35 గంటలకు వైజాగ్ చేరుకుంటుందని ఇండిగో ప్రతినిధి తెలిపారు. తిరిగి విశాఖపట్నం నుంచి రాత్రి 7 గంటలకు బయల్దేరి రాత్రి 8.50 గంటలకు గోవాకు చేరుకుంటుందని వివరించారు. కేవలం 1.50 గంటల్లోనే వైజాగ్ లో బయలుదేరి గోవాలో వాలిపోవచ్చని పేర్కొన్నారు.

More Telugu News