CBI: ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసు.. లాలూను విచారిస్తున్న సీబీఐ అధికారులు

  • ఇదే కేసులో సోమవారం రబ్రీ దేవిని విచారించిన అధికారులు
  • ఉద్యోగ నియామకాలకు బదులుగా భూములు తీసుకున్నారని లాలూ కుటుంబంపై ఆరోపణలు
  • విచారణ పేరుతో లాలూను వేధిస్తున్నారని మండిపడ్డ రోహిణీ ఆచార్య 
Lalu Yadav Questioning by CBI officials In Land For Jobs Case

బీహార్ లో 2004 నుంచి 2009 మధ్య కాలంలో జరిగిన రైల్వే ఉద్యోగాల స్కామ్ లో కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు ఈ రోజు (మంగళవారం) విచారిస్తున్నారు. ఉదయం పండారా రోడ్ లోని లాలూ కుమార్తె మీసా భారతి ఇంటికి చేరుకున్న అధికారులు లాలూ యాదవ్ ను ప్రశ్నిస్తున్నారు. ఇదే కేసులో బీహార్ మాజీ సీఎం, లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవిని సోమవారం సీబీఐ అధికారులు విచారించారు.

కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అభ్యర్థుల నుంచి లంచం తీసుకుని రైల్వేలో నియమించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గ్రూప్ డి ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల నుంచి తక్కువ రేటుకు భూములు కొనుగోలు చేశారని, ఇది క్విడ్ ప్రో కో కిందికే వస్తుందని అధికారులు చెబుతున్నారు.

లాలూ, ఆయన భార్య రబ్రీ దేవి, కూతుళ్లు మీసా, హేమలపైనా ఆరోపణలు వినిపించాయి. దీంతో ఈ కేసును సీబీఐ విచారణ జరుపుతోంది. ఈ కేసులో లాలూ యాదవ్ సహాయకుడు, మాజీ ఓఎస్డీ భోలా యాదవ్ ను సీబీఐ కిందటేడాది జులైలో అరెస్టు చేసింది. కాగా, సీబీఐ విచారణపై లాలూ యాదవ్ కూతురు రోహిణీ ఆచార్య మండిపడ్డారు. విచారణ పేరుతో లాలూను వేధిస్తున్నారని, ఆయనకు ఏమైనా జరగరానిది జరిగితే ఎవ్వరినీ వదిలిపెట్టబోనని బెదిరించారు.

More Telugu News