VA Durai: చేతిలో చిల్లిగవ్వ లేక, వైద్యం చేయించుకోలేక అల్లాడుతున్న ప్రముఖ తమిళ నిర్మాత.. సాయం అందించిన సూర్య

 Pithamagan producer VA Durai seeks help for his medical treatment Suriya comes in for support
  • రజనీకాంత్, సూర్య, విక్రమ్, విజయకాంత్ వంటి వారితో సినిమాలు నిర్మించిన వీఏ దురై
  • పితామగన్ సినిమాకు జాతీయ అవార్డు
  • తర్వాతి సినిమా కోసం బాలకు రూ. 25 లక్షల అడ్వాన్స్
  • ఆ తర్వాత పరిస్థితి తారుమారు
  • డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన బాల
  • సాయం కోసం ముందుకొస్తున్న పలువురు సినీ ప్రముఖులు
తమిళ సూపర్  స్టార్ రజనీకాంత్, విజయకాంత్, విక్రమ్, సూర్య, సత్యరాజ్ వంటివారితో సినిమాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత వీఏ దురై ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతూ చికిత్సకు కూడా డబ్బుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలిసిన ప్రముఖ నటుడు సూర్య రూ. 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. చిత్ర పరిశ్రమకు చెందిన మరికొందరు కూడా ఆయనకు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొస్తున్నారు. 

దురై మొదట్లో ప్రముఖ నిర్మాత ఏఎం రత్ననాథ్‌తో కలిసి ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్‌లో పనిచేశారు. ఆ తర్వాత సొంత నిర్మాణ సంస్థ ఎవర్‌గ్రీన్ ఇంటర్నేషనల్ ప్రారంభించి పలు చిత్రాలు నిర్మించారు. అయితే, ఆ తర్వాత నష్టపోయి కుదేలయ్యారు. ప్రస్తుతం ఆయన మధుమేహంతో బాధపడుతున్నారు. ఆయనకు ఇప్పుడు వైద్య సాయం అవసరమని, శస్త్రచికిత్సకు అవసరమైన డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నారంటూ ఆయన స్నేహితుడు ఒకరు ఫేస్‌బుక్‌లో వీడియో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

దురై నిర్మించిన చివరి సినిమా గజేంద్ర. అంతకుముందు పితామగన్, లవ్‌లీ, లూటీ వంటి చిత్రాలను నిర్మించారు. బాల దర్శకత్వంలో తెరకెక్కిన పితామగన్ సినిమాలో సూర్య, విక్రమ్ కలిసి నటించారు. ఈ సినిమాకు జాతీయ అవార్డు దక్కింది. దురైకి సొంత ఇల్లు కూడా లేదని, చేతిలో చిల్లిగవ్వ లేదని ఆయన స్నేహితుడు కుమార్ తెలిపారు.

కాగా, తన తర్వాతి చిత్రం కోసం పితామగన్ డైరెక్టర్ బాలకు 2003లో దురై రూ. 25 లక్షల అడ్వాన్స్ ఇచ్చారు. అయితే, ఆ తర్వాత ఆ సినిమా పట్టాలకెక్కకపోవడంతో ఆ డబ్బులను బాల తిరిగి ఇవ్వలేదు. ఇది జరిగిన 19 సంవత్సరాల తర్వాత దురై పరిస్థితి తారుమారైంది. దీంతో ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ గతేడాది బాలను కోరారు. 

ఆయన ఆ డబ్బులు తిరిగి ఇచ్చేందుకు నిరాకరించడంతో బాల కార్యాలయం వద్ద దురై నిరసన కూడా తెలిపారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దురై అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిన సూర్య, వెట్రిమారన్‌లు కొంత సాయం చేశారు. మరింత సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
VA Durai
Rajinikanth
Suriya
Pithamagan
Producer VA Durai
Kollywood

More Telugu News