TDP: అనంతపురంలో ఉద్రిక్తతలు... క్లాక్ టవర్ వద్ద టీడీపీ వర్సెస్ వైసీపీ

  • రాప్తాడు నియోజకవర్గంపై టీడీపీ, వైసీపీ మధ్య సోషల్ వార్
  • వైసీపీ వర్గీయులపై టీడీపీ మద్దతుదారుల ఆగ్రహం
  • దమ్ముంటే అనంతపురం రావాలంటూ ఓ వైసీపీ మద్దతుదారుడికి సవాల్
  • రాప్తాడు వచ్చి తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ మద్దతుదారుడు
Clashes between TDP and YCP supporters in Ananatapur

అనంతపురంలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. నందిగామకు చెందిన హరికృష్ణారెడ్డి ఇవాళ రాప్తాడు వచ్చి టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ పైనా, పరిటాల కుటుంబీకులపైనా తీవ్ర వ్యాఖ్యలు చేయడమే కాకుండా, తాను క్లాక్ టవర్ వద్దకు వస్తానంటూ సవాల్ విసిరారు. 

సోషల్ మీడియాలో హరికృష్ణారెడ్డి పోస్టులు టీడీపీ వర్గాలను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. దాంతో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అనంతపురం పట్టణంలోని క్లాక్ టవర్ వద్దకు చేరుకున్నారు. హరికృష్ణారెడ్డి కూడా క్లాక్ టవర్ వద్దకు చేరుకుని పరిటాల కుటుంబసభ్యులపై మరోసారి విమర్శలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడి జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. రాళ్లదాడి సందర్భంగా ఓ టీడీపీ కార్యకర్తకు, పోలీస్ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. తలకు గాయమైన కానిస్టేబుల్ ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. 

గత కొంతకాలంగా సోషల్ మీడియాలో టీడీపీ, వైసీపీ మధ్య రాప్తాడు నియోజకవర్గ అభివృద్ధి పోస్టుల యుద్ధం జరుగుతోంది. అనంతపురం వచ్చి మాట్లాడాలంటూ వైసీపీ మద్దతుదారుడు హరికృష్ణారెడ్డికి టీడీపీ మద్దతుదారుడు సవాల్ విసరగా, ఆ సవాల్ ను స్వీకరించిన వైసీపీ మద్దతుదారుడు అనంతపురం వచ్చాడు. తన రాకను తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశాడు. దాంతో, టీడీపీ, వైసీపీ మధ్య ఆగ్రహావేశాలు భగ్గుమన్నాయి.

More Telugu News