Raghu Rama Krishna Raju: అవినాశ్ విచారణకు రాలేనంటే సీబీఐ సరే అనడం ఏంటి?: రఘురామ

  • వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ కు నోటీసులు
  • రాలేనంటూ సీబీఐకి లేఖ రాసిన అవినాశ్
  • మరో తేదీ సూచించిన సీబీఐ
  • ఎంపీలకు ఈ వెసులుబాటు ఉందా? అంటూ రఘురామ వ్యాఖ్యలు
Raghurama questions CBI issued another notice to Avinash

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని ఇప్పటికే రెండు సార్లు ప్రశ్నించింది. ఈ నెల 6న కూడా ప్రశ్నిస్తాం... రావాలంటూ సీబీఐ మరోసారి అవినాశ్ రెడ్డికి నోటీసులు ఇవ్వగా... తనకు ఆ రోజున ముందు నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నాయని, విచారణకు రాలేనని అవినాశ్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. దాంతో సీబీఐ ఈ నెల 10న విచారణకు రావాలంటూ మరోసారి నోటీసులు పంపింది. 

దీనిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. అవినాశ్ విచారణకు రాలేనంటే సీబీఐ ఓకే అనడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎంపీలకు ఈ విధమైన వెసులుబాటు ఉందేమో తనకు తెలియదని పేర్కొన్నారు. "సీబీఐ వాళ్లు వేసేస్తారని 'ఆయన' చెప్పి ఉంటారు... అందుకే అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు వెళ్లలేదు" అని రఘురామ వివరించారు. 

కాగా, ఈ కేసులో అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిల అరెస్ట్ తప్పదని ఓ మాజీ పోలీసు అధికారి తనతో అన్నారని వెల్లడించారు. గూగుల్ టేక్ ఔట్ లో అన్నీ తెలిసిపోయాయని పేర్కొన్నారు. సునీల్ యాదవ్ కు బెయిల్ సందర్భంలో దాఖలు చేసిన చార్జిషీటులో సీబీఐ అన్ని విషయాలు స్పష్టం చేసిందని తెలిపారు. 

"యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ కార్యకర్తలు బాధపడొద్దు... అరెస్ట్ లు చోటు చేసుకుంటే కడప ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామంటున్నారు" అంటూ రఘురామ తనదైన శైలిలో స్పందించారు. 

ఇక, ఏపీలో సలహాదారులు ఏం సలహాలు ఇస్తున్నారో, ఆ సలహాల వల్ల ప్రభుత్వానికి ఏం లాభాలు కలుగుతున్నాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

More Telugu News