venkatesh maha: ‘కేజీఎఫ్’ హీరో క్యారెక్టరైజేషన్ పై ‘కేరాఫ్ కంచరపాలెం’ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

  • ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో వెంకటేశ్ మహా పరోక్ష విమర్శలు!
  • కేజీఎఫ్ హీరో క్యారెక్టరైజేషన్ పై సెటైర్లు
  • రూ.వందల కోట్లు.. వెయ్యి కోట్ల వసూళ్లు సాధిస్తున్న చిత్రాలన్నీ పాప్ కార్న్ సినిమాలని వ్యాఖ్య
director venkatesh maha sensational comments ON kgf movie

రూ.వందల కోట్లు, రూ.వెయ్యి కోట్లు రాబడుతున్న సినిమాలపై ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేశ్ మహా విమర్శలు చేశారు. ‘కేజీఎఫ్’ పేరు చెప్పకుండానే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హీరో క్యారెక్టర్ ను ‘నీచ్ కమీన్ కుత్తే’ అంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకటేశ్ మహా పలు షాకింగ్ కామెంట్స్ చేశారు.

‘‘రూ.వందల కోట్లు.. వెయ్యి కోట్లు.. ఇలా వసూళ్లు రాబడుతున్న చిత్రాలన్నీ నా దృష్టిలో పాప్ కార్న్ సినిమాలు. తింటూ వాటిని చూడొచ్చు. మధ్యలో సీన్ మిస్ అయినా పర్లేదన్నట్లుగా ఉంటుంది.. ఓటీటీలోనైనా చూడొచ్చు. కానీ మేము తీసేవి ఓటీటీ సినిమాలు కాదు. కచ్చితమైన థియేటర్ చిత్రాలు’’ అని చెప్పుకొచ్చారు. 

కేజీఎఫ్ సినిమాపై వెంకటేశ్ మహా పరోక్ష విమర్శలు చేశారు. హీరో క్యారెక్టరైజేషన్ ను ఎద్దేవా చేస్తూ.. అలాంటి సినిమాలను జనం ఆదరిస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఒక సినిమా పేరు చెప్పను కానీ.. వివరాలు చెప్తాను.. ప్రపంచంలో ఒక తల్లి.. ‘నువ్వు గొప్పోడివి అవ్వాలరా’ అంటుంది. బాగా సంపాదించి నలుగురికీ ఉపయోగపడాలని దానికి అర్థం. కానీ తల్లి అంత కావాలి (చేతులతో చూపిస్తూ)అని అంటుంది. హీరో వెళ్లి ఆ వస్తువును తవ్వేవాళ్లను ఉద్ధరిస్తాడు. ఒక పాట వస్తుంది. వాడు మొత్తం బంగారం తీసుకెళ్లి ఎక్కడో పడేస్తాడు’’ అని విమర్శించారు.

‘‘ఆ మహా తల్లి నిజంగా ఉండి ఉంటే.. నాకు కలవాలని ఉంది. వాడంత పిచ్చోడు ఎవడైనా ఉంటాడా? ఎంత నీచ్ కమీన్ కుత్తే కాకపోతే వాడు.. ఎక్కడో పారదొబ్బుతాడు. అలాంటి కుత్తే అవ్వమని తల్లి అడిగితే.. అలాంటి కథను సినిమాగా తీస్తే.. మనం చప్పట్లు కొట్టి చూస్తున్నాం’’ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఈ ఇంటర్వ్యూలో డైరెక్టర్లు ఇంద్రగంటి మోహన్ కృష్ణ, నందినీ రెడ్డి, శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ కూడా పాల్గొన్నారు. వెంకటేశ్ మహా మాట్లాడుతున్నంత సేపు వాళ్లు నవ్వుతూనే ఉన్నారు. వెంకటేశ్ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో.. ట్విట్టర్ వేదికగా నందినీరెడ్డి క్షమాపణలు చెప్పారు.

కేరాఫ్ కంచరపాలెం సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్నారు వెంకటేశ్ మహా. తర్వాత ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే సినిమా తీశారు. ఇటీవల మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే వెబ్ సిరీస్ లో ఓ ఎపిసోడ్ కు దర్శకత్వం వహించారు. పలు సినిమాల్లో నటుడిగానూ కనిపించారు.

More Telugu News