Medak: అత్త మీద అలిగి కరెంట్ పోల్ ఎక్కిన అల్లుడు!

  • బంగారం పెట్టేదాకా కిందికి దిగేదిలేదని భీష్మించిన వైనం
  • ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో గ్రామస్థులలో టెన్షన్
  • విద్యుత్ సరఫరా నిలిపేసి బాధితుడిని కాపాడేందుకు ప్రయత్నించిన గ్రామస్థులు
Man climbs electric pole because his mother in law did not give him gold as a gift

ప్రేమించి పెళ్లి చేసుకున్న తనకు అత్తింటివారు బంగారం పెట్టలేదని ఓ అల్లుడు అలిగాడు. బంగారం పెట్టాల్సిందేనని డిమాండ్ చేశాడు. ఇక్కడివరకూ బాగానే ఉన్నా.. అత్తారింటి నుంచి బంగారం రాబట్టేందుకు సదరు అల్లుడు చేసిన పనితో ఊరుఊరంతా టెన్షన్ పడింది. కథ సుఖాంతమయ్యాక ఈ సంఘటనను తలుచుకుంటూ నవ్వుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. 

మెదక్ జిల్లాలోని గాంధీనగర్ కు చెందిన శేఖర్ వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. కొంతకాలం కింద శేఖర్ ఓ అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లిలో అత్తింటివారు బంగారం పెట్టకపోవడంతో శేఖర్ మనస్తాపం చెందాడు. ఆదివారం అత్తగారింటికి వెళ్లినపుడు బంగారం విషయం కదిపిచూశాడు. తాను అలిగినా, డిమాండ్ చేసినా కూడా అత్తింటివారు పట్టించుకోకపోవడంతో ఇంట్లో నుంచి బయటకొచ్చి రోడ్డు పక్కనే ఉన్న కరెంట్ పోల్ ఎక్కి కూర్చున్నాడు. బంగారం పెడితేనే కిందికి దిగుతానని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హల్ చల్ చేశాడు.

శేఖర్ కరెంట్ పోల్ ఎక్కడం గమనించి స్థానికులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపేశారు. కిందికి దిగాలని కోరినా శేఖర్ వినిపించుకోలేదు. దీంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హడావుడిగా అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది శేఖర్ ను కిందికి దించేందుకు ప్రయత్నించారు. విషయం తెలిసి అక్కడకు చేరుకున్న మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, డీఎస్పీ, సీఐ లు శేఖర్ తో మాట్లాడారు. అత్తగారి దగ్గరి నుంచి బంగారం ఇప్పిస్తామని వారు హామీ ఇవ్వడంతో శేఖర్ కిందికి దిగాడు. శేఖర్ క్షేమంగా కిందకు రావడంతో ఊరివాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు.

More Telugu News