Punjab: దారుణం.. జైల్లోనే హత్య.. వేడుక చేసుకున్న ఖైదీలు!

  • గ్యాంగ్‌స్టర్ సిధూ మూసేవాలా హత్య కేసులో మరో షాకింగ్ ఘటన
  • ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరిని జైల్లోనే హత్య చేసిన ప్రత్యర్థులు
  • ఘటన వీడియో వైరల్, జైలు సూపరింటెండెంట్ అరెస్ట్
Gangsters Celebrate Killing Inside Prison in Punjab Jail Superintendent Among 5 Arrested

పంజాబ్‌లోని ఓ జైల్లో ఇద్దరు ప్రత్యర్థి గ్యాంగ్ సభ్యుల హత్య తరువాత కొందరు ఖైదీలు వేడుక చేసుకున్న వీడియో ఒకటి తాజాగా రాష్ట్రంలో కలకలానికి దారి తీసింది. తార్న్ తరన్ జైల్లో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేయగా వారిలో జైలు సూపరింటెండెంట్ సహా ఇదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 

గ్యాంగ్‌స్టర్ సిధూ మూసేవాలా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మన్‌దీప్ సింగ్, మన్మోహన్ సింగ్ అనే ఖైదీలు గతవారం జైల్లోనే హత్యకు గురయ్యారు. ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో వారు హత్యకు గురయ్యారు. వారి మృతదేహాలను వేలితో చూపుతూ కొందరు ఖైదీలు వేడుక చేసుకున్న వీడియోలు ఆదివారం వైరల్‌ అయ్యాయి. మృతదేహాలకు కొద్ది దూరంలో పోలీసులు కూడా నిలబడి ఉన్నట్టు వీడియోలో కనిపించడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఏడుగురు గ్యాంగ్‌స్టర్లపై కేసులు నమోదయ్యాయి. 

జగ్గు భగ్వాన్‌పూరియా, లారెన్స్ బిష్ణోయిల నేతృత్వంలోని రెండు గ్యాంగుల మద్య తలెత్తిన ఘర్ణణలో ఈ హత్యలు జరిగినట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో ఆప్‌ నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రమాదంలో పడ్డాయని ఆరోపించాయి. ఘటన జరిగిన అనంతరం నిందితులను జైలు అధికారులు వేరువేరు జైళ్లకు తరలించారు.

More Telugu News