Maharashtra: ముంబైలో కిడ్నాపైన బాలుడు.. ఏడాది తర్వాత జగ్గయ్యపేటలో గుర్తింపు!

  • ముంబైలో బాలుడిని అపహరించిన విజయవాడ మహిళ
  • రూ. 2 లక్షలకు మరో మహిళకు విక్రయం
  • ఆమె తమ బంధువులకు రూ. 3 లక్షలకు అమ్మేసిన వైనం
  • స్కూల్లో చేర్పించి చదివించుకుంటున్న కుటుంబం
  • నిన్న అకస్మాత్తుగా ప్రత్యక్షమై బాలుడిని తీసుకెళ్లిపోయిన మహారాష్ట్ర పోలీసులు
kidnapped mumbai boy found in ap jaggayyapeta after one year

ముంబైలో ఏడాది క్రితం అపహరణకు గురైన బాలుడిని తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. గతేడాది ఫిబ్రవరిలో ముంబైలో ఓ బాలుడు కిడ్నాపయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విజయవాడకు చెందిన ఓ మహిళ బాలుడిని కిడ్నాప్ చేసినట్టు గుర్తించారు. ఆమె జగ్గయ్యపేటకు చెందిన మహిళకు రూ. 2 లక్షలకు చిన్నారిని అమ్మేసింది.

బాలుడిని కొనుగోలు చేసిన మహిళ దేచుపాలెంలోని తన బంధువుల కుటుంబానికి రూ. 3 లక్షలకు విక్రయించింది. ఆ బాలుడిని వారు అల్లారుముద్దుగా పెంచుకుంటూ జగ్గయ్యపేటలోని ఓ ప్రైవేటు స్కూల్లో చేర్పించి చదివిస్తున్నారు. ఆదివారం ఆ స్కూల్లో పాఠశాల వార్షికోత్సవం జరిగింది. ముంబైలో కిడ్నాపైన బాలుడు జగ్గయ్యపేట పాఠశాలలో చదువుతున్నట్టు గుర్తించిన మహారాష్ట్ర పోలీసులు నిన్న స్థానిక పోలీసులతో కలిసి స్కూలుకు చేరుకున్నారు. 

బాలుడు కిడ్నాప్ అయినట్టు నమోదైన కేసు వివరాలను, బాలుడికి సంబంధించిన ఆధారాలను పెంచుకుంటున్న వారికి చూపించి చిన్నారిని తమతో తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ శ్రావణి, మధ్యవర్తిగా వ్యవహరించిన జగ్గయ్యపేటకు చెందిన మరో మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తే బాలుడి వివరాలు లభ్యమైనట్టు చెప్పారు. కాగా, ఏడాదిగా పెంచుకుంటున్న బాలుడు ఒక్కసారిగా దూరం కావడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

More Telugu News