జగన్ ఓ కటింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్: నారా లోకేశ్

  • కొనసాగుతున్న లోకేశ్ యువగళం
  • పుంగనూరు నియోజకవర్గంలో పాదయాత్ర
  • జగన్ 8వ సారి కరెంట్ చార్జీలు పెంచబోతున్నాడన్న లోకేశ్
  • ప్రాజెక్టులు పూర్తి చేయలేదని విమర్శలు
Lokesh describes CM Jagan as a cutting and fitting master

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర పుంగనూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

సీఎం జగన్ రాష్ట్రంలో 8వ సారి కరెంట్ చార్జీలు పెంచబోతున్నాడని అన్నారు. జగన్ ఓ కటింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్ అని వ్యంగ్యం ప్రదర్శించారు. హంద్రీనీవా సహా ప్రాజెక్టులను పూర్తిచేయలేదని, చెక్ డ్యాములు కొట్టుకుపోతే మరమ్మతులు చేయలేదని తెలిపారు. జగన్ పాలనలో ముస్లింలు కష్టాల పాలవుతున్నారని, అవమానాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 

వైసీపీ నేతలు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని, అక్రమంగా ఇసుకను బెంగళూరు తరలిస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే పుంగనూరు, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లిని కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామని లోకేశ్ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలిపించి చంద్రబాబుకు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. 

ఈ సందర్భంగా, నల్లారి కిశోర్ కుమార్ రెడ్డిని పీలేరు టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. భూకబ్జాలను నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి ధైర్యంగా ఎదుర్కొంటున్నారని లోకేశ్ తెలిపారు. 

కాగా, ఇవాళ్టి పాదయాత్రలో లోకేశ్ తో పాటు టీడీపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కూడా పాల్గొన్నారు. జ్యోతి నగర్ విడిది కేంద్రంలో వరుపుల రాజా చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి వరుపుల రాజా తీవ్ర గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.

More Telugu News