Gold Bars in Aircrafts Toilet: విమానం టాయిలెట్ లో నాలుగు కిలోల బంగారం.. ఢిల్లీలో ఘటన!

  • ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయంలో ఆగి ఉన్న విమానంలో అధికారుల తనిఖీలు
  • వాష్ రూమ్ లో సింక్ కింద బూడిద రంగు సంచి గుర్తింపు
  • అందులో నాలుగు బంగారు బిస్కెట్లు.. విలువ రూ.2 కోట్లు 
Gold Bars Worth Rs 2 Crore Recovered From Aircrafts Toilet At Delhi Airport

ఎంత నిఘా పెట్టినా బంగారం అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. విదేశాల నుంచి ముఖ్యంగా అరబ్ దేశాల నుంచి వచ్చే విమానాల్లో అక్రమంగా బంగారాన్ని తీసుకొస్తూ తరచూ పట్టుబడుతూనే ఉన్నారు. అయితే తాజాగా 10 గ్రాములో 100 గ్రాములో కాదు.. ఏకంగా 4 కిలోల బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలో ఆదివారం జరిగిందీ ఘటన.

ఢిల్లీ ఎయిర్ పోర్టులో విమానం టాయిలెట్ లో దాచిన నాలుగు బంగారు బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని తూకం వేయగా.. 3.969 కిలోల బరువు ఉన్నాయి. వీటి ధర రూ.2 కోట్ల దాకా ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.

తమకు వచ్చిన సమాచారం ఆధారంగా తనిఖీలు చేసి.. బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ‘‘అంతర్జాతీయ ప్రయాణాలకు ఉపయోగించే విమానం.. రెండు డొమెస్టిక్ ట్రిప్ లు వెళ్లొచ్చింది. ఎయిర్ పోర్టులోని టర్మినల్ 2లో ఆగింది. ఈ సందర్భంగా విమానంలో సోదాలు చేశాం. వాష్ రూమ్ లో సింక్ కింద ఓ బూడిద రంగు సంచిని అతికించి ఉండటం గమనించాం. దాన్ని తీసి చూడగా.. అందులో 4 బంగారు బిస్కెట్లు కనిపించాయి’’ అని కస్టమ్స్ అధికారులు వివరించారు.

కస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 110 కింద బంగారం, ప్యాకింగ్ మెటీరియల్‌ ను జప్తు చేశామని వివరించారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. అయితే ఈ బంగారం ఎక్కడి నుంచి, ఎవరు తరలించారనే వివరాలు మాత్రం తెలియరాలేదు.

More Telugu News