Kiren Rijiju: తుక్డే తుక్డే గ్యాంగ్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి: కేంద్ర మంత్రి రిజిజు

  • భారత న్యాయ వ్యవస్థ స్వతంత్రమైనదన్న కేంద్ర మంత్రి
  • ప్రధాని మోదీ నాయకత్వంలో గొప్ప పునరుజ్జీవనం చెందుతుందని వ్యాఖ్య
  • భారత్ పై దాడికి విదేశీ శక్తుల సాయం పొందుతున్నారని ఆరోపణ
Tukde tukde gang should understand Minister Kiren Rijiju on Indian judiciary

భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపణలు గుప్పిస్తున్న వేళ.. పరోక్షంగా ఆయన్ను ఉద్దేశించి కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత న్యాయవ్యవస్థ, భారత ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉన్నాయంటూ ప్రపంచానికి చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. 

భువనేశ్వర్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఈ ప్రసంగ వీడియో క్లిప్ ను తన ట్విట్టర్ పేజీలో షేర్ చేస్తూ, ‘‘ప్రధాన మంత్రి మోదీ నాయకత్వంలో భారత్ గొప్ప పునరుజ్జీవాన్ని చూస్తోందన్న విషయాన్ని తుక్డే, తుక్డే గ్యాంగ్ అర్థం చేసుకోవాలి’’అని పేర్కొన్నారు. 

కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. భారత ప్రజాస్వామ్యం దాడిని ఎదుర్కొంటోందని వ్యాఖ్యానించారు. తనతోపాటు ఎంతో మంది రాజకీయ నేతలపై నిఘా నడుస్తోందన్నారు. భారత ప్రజాస్వామ్యంపై దాడికి నిదర్శనంగా.. న్యాయవ్యవస్థ, మీడియాపై నియంత్రణ, నిఘా, చొరబాటు, కేంద్ర దర్యాప్తు సంస్థల చర్యలు, మైనారిటీలు, దళితులు, గిరిజనులపై దాడులను ప్రస్తావించారు.

దీనికి కిరణ్ రిజిజు దీటుగా బదులిచ్చారు. ‘‘భారత న్యాయ వ్యవస్థ స్వతంత్రమైనది. ప్రతిపక్ష పాత్రను పోషించేలా భారత న్యాయవ్యవస్థను బలవంతం చేయకూడదు. ఎవరూ కూడా భారత ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించలేరు. ఎందుకంటే ప్రజాస్వామ్యం అన్నది మన రక్తంలోనే ఉంది. భారత్ పై దాడికి ఈ గ్యాంగ్ భారత వ్యతిరేక విదేశీ శక్తుల చురుకైన మద్దతు పొందుతోంది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, భారత ప్రభుత్వం, న్యాయవ్యవస్థ, రక్షణ, ఎన్నికల కమిషన్, దర్యాప్తు సంస్థలు సహా అన్ని కీలక వ్యవస్థల విశ్వసనీయతపై వ్యవస్థీకృత దాడి చేస్తున్నారు. అటువంటి వారికి భారత ప్రజలు తగిన బదులిస్తారు’’అని కిరణ్ రిజిజు పేర్కొన్నారు.

More Telugu News