Maharashtra: కొడుకుకు స్లిప్పులు ఇచ్చేందుకు వెళ్లి తన్నులు తిన్న తండ్రి.. వీడియో ఇదిగో!

  • మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఘటన
  • రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ఎస్ఎస్ సీ, ఇంటర్ పరీక్షలు
  • కొడుకు కాపీ కొట్టేందుకు సాయం చేసేందుకు తండ్రి ప్రయత్నం
  • ఒకసారి హెచ్చరించినా వినకపోవడంతో చితకబాదిన పోలీసులు
Maharashtra jalgaon police beaten a man for helping his child copy in exam

పబ్లిక్ పరీక్షలకు బాగా చదివి ఫస్ట్ క్లాసులో పాస్ కావాలని తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పడం కామన్.. కానీ, కొడుకు పరీక్ష పాస్ కావడానికి స్వయంగా ఓ తండ్రే స్లిప్పులు అందించే ప్రయత్నం చేశాడు. పరీక్షా కేంద్రానికి వెళ్లి కొడుకుకు సాయం చేయాలని చూశాడు. అది చూసి పోలీసులు తమ చేతిలోని లాఠీలకు పనిచెప్పారు. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మహారాష్ట్రలో టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జల్గావ్ జిల్లా చోప్రా తహసీల్‌ అడవాడ్ గ్రామంలోని నూతన్ జ్ఞాన మందిర్ విద్యాలయంలో విద్యార్థులు మరాఠీ పరీక్ష రాస్తున్నారు. ఈ కేంద్రంలో పరీక్ష రాస్తున్న తన కొడుకుకు సాయం చేయాలని ఓ తండ్రి నిర్ణయించుకున్నాడు. కొన్ని స్లిప్పులు పట్టుకుని పరీక్షా కేంద్రం దగ్గరికి వెళ్లాడు. తన కొడుకు ఏ గదిలో ఉన్నాడోనని వెతుకుతుండగా విధుల్లో ఉన్న పోలీసులు గమనించి హెచ్చరించారు. అక్కడి నుంచి దూరంగా పంపించారు. 

కాసేపటికి ఆ తండ్రి మరోమారు ప్రయత్నించేందుకు పరీక్ష కేంద్రం దగ్గరికి వెళ్లాడు. దీంతో పోలీసులు పట్టుకోవడంతో విడిపించుకుని పారిపోయే ప్రయత్నం చేశాడు. ఒకటికి రెండుసార్లు చెప్పినా వినకపోవడంతో పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు. సదరు తండ్రిని ఓ పోలీస్ అధికారి లాఠీతో చితకబాదాడు. ఈ తతంగాన్నంతా అక్కడ ఉన్నవారు తమ ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది.

More Telugu News