Uttar Pradesh: ఆ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనం కొంటే పన్నులు కట్టక్కర్లేదు!

  • యూపీలో రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
  • మూడేళ్ల పాటు అమలు చేస్తామని యోగి సర్కారు ప్రకటన
  • ప్రభుత్వ నిర్ణయంతో భారీగా తగ్గనున్న వాహనాల ధరలు
UP To Exempt Electric Vehicle Buyers From Registration Fees For 3 Years

కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహిస్తోంది. కొత్తగా ఈవీలు కొనుగోలు చేసే వారికి తాజాగా యోగి సర్కారు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రోడ్ ట్యాక్స్ తో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపింది. మూడేళ్ల పాటు ఈ ఉతర్వులు అమలులో ఉంటాయని, గతేడాది అక్టోబర్ 14 తర్వాత ఎలక్ట్రిక్ వాహనాలు కొన్నవారికీ ఈ రూల్ వర్తిస్తుందని తెలిపింది.

ఒకవేళ సదరు ఎలక్ట్రిక్ వాహనం కనుక రాష్ట్రంలోనే తయారైతే.. ఈ పన్ను మినహాయింపులు ఐదేళ్ల పాటు వర్తిస్తాయని పేర్కొంది. ఈమేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల రీజినల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసులకు (ఆర్ టీ వో) లకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించింది. ప్రభుత్వం జారీచేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం ఎలక్ట్రిక్ వాహనం (ఈవీ) అంటే.. ఎలక్ట్రిక్ మోటార్లు బిగించిన ప్రతీ ఆటోమొబైల్, బ్యాటరీలు, అల్ట్రాకెపాసిటర్లు, ఫ్యూయెల్ సెల్ లతో నడిచే వాహనాలు.

ఇందులో ద్విచక్ర వాహనాలు, త్రీ, ఫోర్ వీలర్లు, హైబ్రీడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీ, ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నీ వస్తాయి. ఈ కేటగిరీలలోని వాహనాలు కొనుగోలు చేస్తే సుమారు చిన్న వాహనాల ధర రూ.4 వేల వరకూ తగ్గుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు కేంద్రం అందించే సబ్సిడీని కూడా కలుపుకుంటే.. ద్విచక్ర వాహనాల ధర సుమారు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు తగ్గుతుంది. కార్ల ధర రూ. లక్ష వరకు తగ్గుతుందని షోరూం యజమానులు చెబుతున్నారు.

More Telugu News