Prattipadu: ప్రత్తిపాడు టీడీపీ నేత వరుపుల రాజా హఠాన్మరణం

  • రాత్రి 9 గంటల సమయంలో గుండెపోటు
  • కాకినాడలోని సూర్య గ్లోబల్ ఆసుపత్రికి తరలింపు
  • పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి అపోలోకు
  • అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 11 గంటలకు మృతి
  • షాక్‌లో టీడీపీ నేతలు
Prattipadu TDP Leader Varupula Raja Passes Away

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ నేత వరుపుల రాజా గత రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 47 సంవత్సరాలు. గత రాత్రి 9 గంటలకు గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే కాకినాడలోని సూర్య గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి స్థానిక అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 11 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు

ఐదేళ్ల క్రితం కూడా రాజా గుండెపోటుకు గురయ్యారు. అప్పట్లో వైద్యులు స్టంట్ వేశారు. తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటున్న ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొబ్బిలి, సాలూరు నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న ఆయన కొన్ని రోజులుగా ప్రచారంలో తీరిక లేకుండా గడుపుతున్నారు. నిన్న సాయంత్రమే స్వగ్రామం ప్రత్తిపాడు చేరుకున్నారు. రాత్రి 8.30 గంటల వరకు పార్టీ నేతలు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ తర్వాత ఆయన ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు.  

ప్రత్తిపాడు మండల అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన రాజా.. డీసీసీబీ చైర్మన్‌గా, ఆప్కాబ్ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 

వరుపుల రాజా మృతితో టీడీపీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతి విషయం తెలిసి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజా మృతి టీడీపీకి తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆత్మీయ స్నేహితుడైన రాజా ఆకస్మిక మృతి తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేశారు.

More Telugu News