Ippatam: ఇప్పటం గ్రామంలో 144 సెక్షన్ విధించిన పోలీసులు

  • ఇప్పటంలో మరోసారి కూల్చివేతలు
  • గ్రామంలో మళ్లీ ఉద్రిక్తతలు
  • అధికారుల తీరు పట్ల గ్రామస్తుల ఆగ్రహం
  • ప్రభుత్వంపై మండిపడిన నాదెండ్ల మనోహర్
Section 144 imposed in Ippatam village

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఆక్రమణల పేరిట పలు నిర్మాణాలను కూల్చివేసేందుకు అధికారులు ప్రయత్నించడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధికారుల తీరు పట్ల ఆందోళనకు దిగారు. 

ఈ నేపథ్యంలో, ఇప్పటం గ్రామంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ప్రజలెవరూ గుంపులుగా కనిపించవద్దని హెచ్చరించారు. 

ఇప్పటంలో మళ్లీ కూల్చివేతలు జరుగుతుండడం పట్ల జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో స్పందించారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభ కోసం ఇప్పటం గ్రామస్తులు భూమి ఇచ్చారన్న కక్షతోనే ప్రభుత్వం కూల్చివేతలకు పాల్పడుతోందని మండిపడ్డారు. వైసీపీ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారని, ఆ రోజు త్వరలోనే వస్తుందని అన్నారు. 

"ఈ కార్యక్రమం శని, ఆదివారాలే ఎందుకు చేస్తున్నారు? సోమ, మంగళవారాల్లో ఎందుకు చేయడంలేదు? ఎందుకింత మూర్ఖత్వం? మీలో పరిపాలనా దక్షత ఏమాత్రం లేదు. జ్ఞానం, పరిజ్ఞానం లేదు. 4 వేల జనాభా ఉన్న చిన్న గ్రామంలో ఇప్పటికే 80 అడుగుల రోడ్డు ఉంటే, దాన్ని 120 అడుగులకు పెంచుతున్నామని చెబుతున్నారు. ఇవాళ 200 మంది పోలీసులతో భయభ్రాంతులకు గురిచేసి కూల్చివేతలకు పాల్పడుతున్నారు. 

రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని విశాఖ సదస్సు సందర్భంగా ఎలాంటి విమర్శలు చేయబోమని మేం ప్రకటించాం. విశాఖలో మీరు మంచి కార్యక్రమం చేయండి అని పేర్కొన్నాం. కానీ ఈ ప్రభుత్వం మహిళలను, రైతులను వేధించే విధంగా నేడు కూల్చివేతలకు దిగింది. 

యుద్ధం మీరు మొదలుపెట్టారు... గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారూ... కచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన ప్రభుత్వం రాబోతోంది. అప్పుడు ప్రతి వైసీపీ నేత సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. 

వైసీపీ ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద కూడా ఇలాగే 120 అడుగుల రోడ్లు ఉన్నాయా? పెద్ద రోడ్లు వేయాలని ఇప్పటంలో ఎవరైనా కోరారా? ఆ గ్రామానికి వెళ్లడానికే రోడ్డు లేకపోతే, ఊరి లోపల పెద్ద రోడ్లు వేయడం హాస్యాస్పదం. పచ్చని గ్రామాల్లో మంటలు పెడుతున్నారు" అంటూ నాదెండ్ల మనోహర్ నిప్పులు చెరిగారు.

More Telugu News