Andrey Botikov: అపార్ట్ మెంట్ లో హత్యకు గురైన రష్యా కొవిడ్ వ్యాక్సిన్ సృష్టికర్త

  • స్పుత్నిక్-వి వ్యాక్సిన్ అభివృద్ధిలో పాలుపంచుకున్న ఆండ్రీ బొటికోవ్
  • మాస్కోలోని అపార్ట్ మెంటులో విగతజీవుడిగా బొటికోవ్
  • అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • బెల్టుతో మెడకు ఉచ్చు బిగించి హత్య
Russian senior scientist killed in his apartment

రష్యా కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వి సృష్టికర్త ఆండ్రీ బొటికోవ్ దారుణ హత్యకు గురయ్యారు. మాస్కోలోని తన అపార్ట్ మెంట్ లో ఆయనను విగతజీవుడిగా ఉన్న స్థితిలో గుర్తించారు. ఓ బెల్టుతో ఆయన మెడకు ఉచ్చు బిగించి అంతమొందించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ హత్యతో సంబంధం ఉందని భావిస్తున్న ఓ అనుమానితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

బొటికోవ్ వయసు 47 సంవత్సరాలు. యావత్ ప్రపంచం కరోనాతో సతమతమవుతున్న వేళ రష్యాలోని గమలేయా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎకాలజీ అండ్ మాథమేటిక్స్ సహకారంతో స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశారు. బొటికోవ్ గమలేయా రీసెర్చ్ సెంటర్ లో సీనియర్ సైంటిస్టుగా పనిచేస్తున్నారు. బొటికోవ్ ను అప్పట్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఫర్ ద ఫాదర్లాండ్ అవార్డుతో సత్కరించారు. 

కాగా, బొటికోవ్ మరణంపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 29 ఏళ్ల యువకుడు ఒకరు బొటికోవ్ తో తీవ్ర వాగ్వాదం అనంతరం బెల్టును మెడకు బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. కాగా, హంతకుడికి గతంలో నేర చరిత్ర ఉన్నట్టు స్పష్టమైంది.

More Telugu News