Atchannaidu: టీడీపీ న్యాయవిభాగానికి చేతినిండా పని దొరికింది: అచ్చెన్నాయుడు

  • మంగళగిరిలో టీడీపీ లీగల్ సెల్ రాష్ట్రస్థాయి సదస్సు
  • హాజరైన అచ్చెన్నాయుడు
  • ఇప్పుడు లీగల్ సెల్ అవసరం ఎక్కువగా ఉందని వెల్లడి
  • కుట్రల్ని ఛేదించేందుకు లీగల్ సెల్ మరింత కృషి చేయాలని పిలుపు
Atchannaidu attends TDP legal cell meeting

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు టీడీపీ న్యాయ విభాగం రాష్ట్రస్థాయి సదస్సులకు హాజరయ్యారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ లో ఈ సమావేశం జరిగింది. 

ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చాక లీగల్ సెల్ అవసరం ఇప్పుడొచ్చినంతగా గతంలో మరెప్పుడూ రాలేదని అన్నారు. చెప్పడానికి కొంచెం బాధగా ఉన్నప్పటికీ, ఈ నాలుగేళ్లలో న్యాయవాదులకు చేతినిండా పని దొరికిందని తెలిపారు. ఈ నాలుగేళ్ల పాలనలో లీగల్ సెల్ అండ లేకపోతే టీడీపీ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండేదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 

రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు టీడీపీ సిద్ధంగా ఉందంటే అందులో లీగల్ సెల్ తోడ్పాటు ఎంతో ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీలేవీ ఉండకూడదన్నట్టు సైకో పాలన కొనసాగుతోందని, లోకేశ్ పాదయాత్రలో రెండ్రోజులకో కేసు నమోదు చేస్తుండడం వారి దుర్మార్గ వైఖరికి నిదర్శనం అని విమర్శించారు. 

వచ్చే ఎన్నికల్లో భారీగా దొంగ ఓట్లు వేసేందుకు వైసీపీ ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోందని ఆరోపించారు. ప్రత్యర్థుల కుట్రల్ని ఛేదించేందుకు టీడీపీ లీగల్ సెల్ గట్టిగా కృషి చేయాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

More Telugu News