IMA: సీజన్ లో వచ్చే జలుబు, దగ్గుకు యాంటీబయాటిక్స్ వాడద్దు: ఐఎంఏ

  • జ్వరం మూడో రోజుతో తగ్గుతుంది
  • దగ్గు మూడు వారాల్లో పోతుంది
  • ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా వల్లే వచ్చిందా? అన్నది నిర్ధారించుకోవాలి
  • సూచన జారీ చేసిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్
IMA says antibiotics for seasonal cold cough fever will not work

సీజనల్ గా (రుతువుల వారీ) వచ్చే జలుబు, దగ్గు తగ్గడానికి యాంటీబయాటిక్ ఔషధాలు తీసుకోవడం సరికాదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఓ సూచన జారీ చేసింది. జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, వికారం, వాంతులు, జ్వరం ఇవన్నీ సాధారణమేనని పేర్కొంది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్ సీడీసీ)ను ప్రస్తావిస్తూ.. జ్వరం మూడో రోజుతో తగ్గిపోతుందని, హెచ్2ఎన్2 ఇన్ ఫ్లూయెంజా వైరస్ లో దగ్గు తగ్గడానికి మూడు వారాలు పడుతుందని పేర్కొంది. 

యాంటీ బయాటిక్స్ ఔషధాలు సూచించే ముందు సదరు ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా వల్ల వచ్చిందా? కాదా? అన్నది వైద్యులు నిర్ధారించుకోవాలని సూచించింది. రోగ లక్షణాల ఆధారంగా చికిత్స ఇవ్వాలని పేర్కొంది. ఈ దగ్గు, జలుబు అన్నవి యాంటీబయాటిక్స్ అవసరం లేకుండానే తగ్గిపోతాయని పేర్కొంది. 

‘‘ప్రజలు ఇప్పుడు అజిత్రోమైసిన్, అమోక్సిసిలిన్ యాంటీబయాటిక్స్ ఔషధాలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో తగినంత జాగ్రత్తలు తీసుకోవడం లేదు. కొంచెం తగ్గినట్టు అనిపించగానే మానేస్తున్నారు. ఇలా చేయడాన్ని వెంటనే ఆపివేయాలి. లేదంటే యాంటీబయాటిక్ నిరోధకత ఏర్పడుతుంది. అసలు యాంటీబయాటిక్స్ అవసరం ఏర్పడినప్పుడు అవి సమర్థవంతంగా పనిచేయవు’’ అని ఐఎంఏ పేర్కొంది.

ఇక డయేరియాకు కూడా యాంటీబయాటిక్స్ ఔషధాలను వైద్యులు సూచిస్తుండడాన్ని తప్పుబట్టింది. 70 శాతం డయేరియా (నీళ్ల విరేచనాలు/అతిసారం) కేసులు వైరల్ వల్ల వస్తున్నవని పేర్కొంది. అమోక్సిసిల్లిన్, నార్ ఫ్లాక్సాసిల్లిన్, సిప్రోఫ్లాక్సాసిల్లిన్, ఓఫ్లాక్సాసిల్లిన్, లెవోఫ్లాక్సాసిల్లిన్.. వీటిని దుర్వినియోగం చేస్తున్నట్టు ప్రస్తావించింది. వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్ పనిచేయవు.

More Telugu News