G. Kishan Reddy: ఏపీలో రాజకీయాలు దిగజారుతున్నాయి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • కుటుంబాల మధ్య జరుగుతున్న ఘర్షణతో ఏపీ ప్రజలు నష్టపోతున్నారన్న కిషన్ రెడ్డి
  • కక్ష సాధింపు చర్యలతో అభివృద్ధి కుంటుపడుతోందని విమర్శ
  • విశాఖపట్నం రాజధాని ప్రాంతమని వ్యాఖ్య
kishan reddy comments on AP Politics

ఏపీ రాజకీయాలపై బీజేపీ తెలంగాణ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాజకీయాలు నానాటికి దిగజారుతున్నాయని విమర్శించారు. కుటుంబాల మధ్య జరుగుతున్న ఘర్షణతో రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారని చెప్పారు. కక్ష సాధింపు చర్యలతో అభివృద్ధి కుంటుపడుతోందని చెప్పారు. ఈ రోజు విశాఖలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమమే అజెండా కావాలని, కక్ష సాధింపు చర్యలతో ఏం సాధించలేరని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. ఇంత తక్కువ సమయంలో ఇంత అభివృద్ధి ఏపీలో ఎప్పుడూ జరగలేదని, రాష్ట్రానికి అనేక విద్యా, పరిశోధనా సంస్థలు వచ్చాయని వెల్లడించారు. రాజకీయాల కోసం కొందరు కేంద్రంపై బురద జల్లుతున్నా.. తాము అభివృద్ధి అజెండాగా పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. 

విశాఖపట్నం రాజధాని ప్రాంతమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మాధవ్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు. మాధవ్ వంటి వారు ఉంటే ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. హైదరాబాద్ లో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలోని రాజధానిలో నిర్వహించే సభకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతారని వెల్లడించారు.

More Telugu News