Sushmita Sen: ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపిస్తేనే సరిపోదు.. సుస్మితా సేన్ హార్ట్ ఎటాక్ ఘటనపై వైద్య నిపుణుల సూచన!

  • శారీరక వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యంగా ఉన్నామనుకుంటే పొరపాటు
  • మానసికంగానూ ఫిట్ నెస్ అవసరమంటున్న వైద్య నిపుణులు
  • మహిళల్లో మెనోపాజ్ తర్వాత ఆరోగ్య సమస్యలకు అవకాశం
A healthy looking body isnot enough Experts on Sushmita Sens heart attack

ప్రముఖ నటి సుస్మితాసేన్ తనకు హార్ట్ ఎటాక్ వచ్చిందని, యాంజియో ప్లాస్టీ చేసి స్టెంట్ వేశారని చెప్పి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. కారణాలను మాత్రం ఆమె వెల్లడించలేదు. మరి సుస్మితా సేన్ కు ఏమి తక్కువ..? అందమా? సంపదా? అన్నీ ఉన్నాయి కదా..? గుండెకు ముప్పు ఎందుకు వచ్చింది? అనే సందేహాలు చాలా మందిలో మెదులుతున్నాయి. ఈ విషయంలో నిపుణులు ఏం చెబుతున్నారంటే.. చూడ్డానికి బావుంటే కాదు.. గుండె ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. వ్యాయామాలు చేసినా ఆరోగ్యంగా ఉంటామనే గ్యారంటీ లేదంటున్నారు..!

సంపూర్ణ ఫిట్ నెస్
కొన్ని వ్యాయామాలు చేస్తూ ఫిట్ గా ఉంటున్నామని అనుకుంటే పొరపాటేనని నిపుణులు చెబుతున్నారు. శారీరక ఆరోగ్యం చూసి మాయలో పడిపోవద్దని హెచ్చరిస్తున్నారు. మానసిక, శారీరక, భావోద్వేగ పరమైన సమతుల్యత అవసరమని సూచిస్తున్నారు. ‘‘రోజువారీగా వ్యాయామాలు చేసే వ్యక్తి.. ఎంతో ఒత్తిడి ఎదుర్కొంటుంటే దాన్ని పూర్తి ఫిట్ నెస్ గా పరిగణించడానికి లేదు. ఈ తరహా వ్యక్తుల కంటే తక్కువగా, మధ్యమధ్యలో వ్యాయామాలు చేస్తూ మానసికపరమైన ఆరోగ్యంతో ఉంటేనే మంచి ఫిట్ నెస్ అవుతుంది’’ అని నిపుణులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్ పేరుకుని, గుండెకు రక్త ప్రవాహ మార్గాలు కుచించుకుపోయినప్పుడు స్టెంట్లు వేస్తుంటారు. ధమనుల్లో బ్లాక్ ఏర్పడినప్పుడు హార్ట్ ఎటాక్ వస్తుంటుంది. 

మెనోపాజ్ తో రిస్క్
ఇక మహిళలకు 45-50 ఏళ్ల సమయంలో మెనోపాజ్ దశ వస్తుంది. అంటే నెలసరి నిలిచిపోతుంది. దీంతో హార్మోన్ల ఉత్పత్తి చాలా వరకు తగ్గిపోతుంది. ఫలితంగా సహజ రక్షణ బలహీనపడుతుంది. రుతుసరి కాలంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ సమృద్ధిగా విడుదల అవడం వల్ల మహిళలను ఎన్నో రకాలుగా అది రక్షిస్తుంటుంది. మెనోపాజ్ లో ఈ రక్షణే కొరవడుతుంది. అందుకని మెనోపాజ్ లో ఎన్నో అనారోగ్యాలు మహిళలను పలకరిస్తుంటాయి. కనుక మహిళలు ఆ వయసులో ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ చూపించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఈ లక్షణాలతో వెంటనే అప్రమత్తం
ఛాతీలో ప్రెషర్, ఒత్తిడి నిమిషాల నుంచి గంటల పాటు ఉంటే, దవడ నొప్పి, మెడ నొప్పి, భుజంలో నొప్పి, రెండు చేతుల్లో, పొట్టపై భాగంలో నొప్పి ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తల తిరగడం, తరచుగా అజీర్ణం, గుండెలో మంట కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

రిస్క్ ఫ్యాక్టర్లు
హైపర్ టెన్షన్ (బీపీ), పొగతాగడం, మధుమేహం, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ఒత్తిడి, దిగులు, అనారోగ్యకర ఆహార అలవాట్లు గుండెకు చేటు చేస్తాయి.

More Telugu News