world test championship: ఒక్క ఓటమితో సంక్లిష్టమైన డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు.. నాలుగో టెస్టులో టీమిండియా గెలవాల్సిందే!

  • టీమిండియాపై గెలుపుతో ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ కు అర్హత సాధించిన ఆసీస్
  • నాలుగో టెస్టులో మన జట్టు ఓడిపోతే.. శ్రీలంక, కివీస్ టెస్టు సిరీస్ ఫలితంపై ఆధారపడాల్సిన పరిస్థితి
  • ఈ నెల 9 నుంచి అహ్మదాబాద్ వేదికగా చివరి మ్యాచ్
team india chances for world test championship final 2023 after defeat against australia in third test

ఒక్క ఓటమి.. ఒకే ఒక్క ఓటమి టీమిండియా ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) అవకాశాలను సంక్లిష్టం చేసింది. దర్జాగా ఫైనల్ కు వెళ్లొచ్చని అనుకుంటే.. ఇప్పుడు ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సి వస్తోంది.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టులు గెలిచిన టీమిండియా.. డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను మెరుగుపరచుకుంది. కానీ మూడో టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలైంది. తాను రూపొందించిన ‘స్పిన్’ ఉచ్చులో తానే చిక్కుకుని ప్రత్యర్థికి విజయాన్ని అప్పగించింది.

ఫలితంగా ఒక్క గెలుపుతో డబ్ల్యూటీసీ ఫైనల్ కు ఆసీస్ దూసుకెళ్లింది. అయితే, మన జట్టుకు ఫైనల్ దారులు మూసుకుపోలేదు కానీ, నేరుగా ఫైనల్ కు చేరాలంటే అహ్మదాబాద్ వేదికగా జరిగే చివరిదైన నాలుగో టెస్టులో టీమిండియా తప్పక నెగ్గాలి. అప్పుడు న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య జరిగే రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఫలితంపై ఆధారపడాల్సిన పని ఉండదు.

ఒకవేళ నాలుగో టెస్టులో టీమిండియా ఓడినా, లేక డ్రా చేసుకున్నా శ్రీలంక, కివీస్ టెస్టు సిరీస్ పై ఆధారపడాల్సి ఉంటుంది. అది కూడా శ్రీలంకపై న్యూజిలాండ్ గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ కివీస్ పై శ్రీలంక నెగ్గితే.. శ్రీలంక జట్టు వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుకుంటుంది.

ఇక శ్రీలంక, న్యూజిలాండ్ సిరీస్ డ్రాగా ముగిసినా.. సిరీస్ ను కివీస్ గెలిచినా.. అప్పుడు భారత్, ఆసీస్ జట్లు ఫైనల్లో ఆడతాయి. అసలు కివీస్, శ్రీలంక సిరీస్ తో సంబంధం లేకుండా ఫైనల్ కు చేరాలంటే మాత్రం నాలుగో టెస్టులో భారత్ విజయం సాధించాల్సి ఉంది. ఈ నెల 9 నుంచి అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. తాజా ఓటమి నేపథ్యంలో జట్టులో భారీ మార్పులు చేసే అవకాశం ఉంది.

More Telugu News