Mukesh Ambani: ఏపీలో మా పెట్టుబడులు కొనసాగుతాయి: ముఖేశ్ అంబానీ

more investments will continue in andhra pradesh says mukesh ambani
  • జగన్ నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందన్న అంబానీ
  • ఏపీలో జియో కోసం 40 వేల కోట్ల పెట్టుబడులు పెట్టామని వ్యాఖ్య
  • రాష్ట్రంలోని 6 వేల గ్రామాలకు రిలయన్స్ రిటైల్ విస్తరించిందని వెల్లడి
  • గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ లో ప్రసంగించిన రిలయన్స్ అధినేత
భారతదేశానికి ఏపీ ఎంతో ముఖ్యమని రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయని, అందులో తాము భాగస్వామ్యం అవుతామని వివరించారు. రాష్ట్రంలో తమ పెట్టుబడులు కొనసాగుతాయని తెలిపారు. విశాఖలో ఈ రోజు ప్రారంభమైన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ లో ముఖేశ్ అంబానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేశారు. 

తెలుగులో ‘నమస్కారం’ అంటూ అంబానీ తన ప్రసంగం ప్రారంభించారు. ఈ సదస్సులో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందన్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో టాలెంట్ ఉన్న యువత ఉంది. సహజ వనరులు ఉన్నాయి. కృష్ణా, గోదావరి నదులు.. విశాఖ, తిరుమల లాంటి నగరాలు.. విజయనగర సామ్రాజ్య చరిత్ర.. ఇలా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ పారిశ్రామికవేత్తలకు కలిసొచ్చే అంశాలు’’ అని వివరించారు. 

ప్రపంచంలో గొప్ప సైంటిస్టులు, డాక్టర్లు సహా వివిధ రంగాల్లో ఏపీ వాళ్లు ఉన్నారని అంబానీ చెప్పారు. రిలయన్స్ సంస్థలో కూడా చాలా మంది మేనేజర్లు, ప్రొఫెషనల్స్ ఏపీ వాళ్లు ఉన్నారని తెలిపారు. మెరైన్ రంగంలో ఏపీ బాగా అభివృద్ధి సాధించగలదని చెప్పారు. 

ప్రధాని మోదీ వల్ల దేశం దూసుకెళ్తోందనీ.. అలాగే సీఎం జగన్ వల్ల ఏపీ ముందుకెళ్తోందని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే ఏపీ ముందుందని చెప్పారు. జగన్ నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. 2002 నుంచి సహజ వాయువు రంగంలో రిలయన్స్ పెట్టుబడులు పెడుతోందని, దేశంలో 30 శాతం తమ గ్యాస్ ఉత్పత్తి ఏపీ నుంచే జరుగుతోందని వెల్లడించారు. 

రాష్ట్రంలో జియో ద్వారా 4జీ నెట్‌వర్క్‌ 98 శాతం కవర్‌ చేస్తున్నట్లు తెలిపారు. 5జీ టెక్నాలజీని 2023 చివరి నాటికి ఏపీ సహా దేశమంతా విస్తరిస్తామని తెలిపారు. ఏపీ ఎకానమీలో జియో 5జీ.. కొత్త డిజిటల్ రివల్యూషన్ తీసుకురాబోతోందని తెలిపారు. ఏపీలో జియో కోసం 40 వేల కోట్ల పెట్టుబడులు పెట్టామని, ఈ పెట్టుబడులు, 5జీ నెట్ వర్క్ రాకతో బిజినెస్, ఉద్యోగ అవకాశాలు భారీగా పెరగబోతున్నాయని వివరించారు.

ఏపీలోని 6 వేల గ్రామాలకు రిలయన్స్ రిటైల్ విస్తరించిందని ముఖేష్ అంబానీ వెల్లడించారు. 1.29 లక్షల కిరాణా దుకాణాలతో రిలయన్స్ రిటైల్ సంబంధాలు కొనసాగిస్తోందని వివరించారు. రిలయన్స్ రిటైల్ 20 వేల ఉద్యోగాలు ప్రత్యక్షంగా .. వేల సంఖ్యలో ఉద్యోగాలు పరోక్షంగా ఇవ్వగలిగిందని తెలిపారు. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా.. విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వివరించారు.
Mukesh Ambani
Advantage Andhra pradesh Global Investment Summit 2023
YS Jagan
YSRCP
JIo
Reliance

More Telugu News