global investors summit: అందులో వరుసగా మూడు సార్లు మొదటి స్థానం ఏపీదే: మంత్రి బుగ్గన

  • రాష్ట్రంలో వనరులు అపారం.. అవకాశాలు పుష్కలమన్న బుగ్గన
  • వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని వెల్లడి
  • జగన్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రంగంలో ప్రగతి దిశగా ముందుకెళ్తోందని వ్యాఖ్య
  • గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ లో ఆర్థిక మంత్రి ప్రసంగం
andhra pradesh is number one in ease of doing business says minister buggana rajendranath reddy on global investors summit

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా జగన్‌ ప్రభుత్వం గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ (జీఐఎస్) నిర్వహిస్తోంది. విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌ వేదికగా ఈ రోజు ఉదయం అట్టహాసంగా ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ముందుగా ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు.

ఏపీలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని మంత్రి చెప్పారు. విశాఖలో కాస్మోపాలిటిన్ కల్చర్ ఉందని తెలిపారు. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని వివరించారు. బిజినెస్‌ ఇండస్ట్రీలపై సీఎం జగన్‌ మంచి దార్శనికతతో ఉన్నారని.. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ నంబర్‌వన్‌గా ఉందని తెలిపారు. వరుసగా మూడుసార్లు మొదటి స్థానం ఏపీదేనని తెలిపారు.

వనరులు, వసతులు, ఆయా ప్రాంతాల్లో ఉన్న అవకాశాలతోనే పారిశ్రామికాభివృద్ధి జరుగుతోందని, ఏపీలో వనరులు అపారంగా ఉన్నాయని, అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని బుగ్గన చెప్పారు. వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని, నైపుణ్య మానవ వనరులకు రాష్ట్రం చిరునామాగా మారిందని తెలిపారు. 

పునరుత్పాదక శక్తి రంగంలో అవకాశాలకు సంబంధించి ఏపీకి పోటీనే లేదని మంత్రి బుగ్గన చెప్పుకొచ్చారు. సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రంగంలో ప్రగతి దిశగా ముందడుగు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

More Telugu News