Vijayawada: విజయవాడలో దారుణం.. స్నానం చేస్తుండగా మహిళ ఫొటోలు తీసి బెదిరిస్తూ ఏడాదిగా అత్యాచారం

Man Arrested for Molesting woman in Vijayawada
  • ఫొటోలు బయటి వ్యక్తులకు పంపుతానంటూ బెదిరింపులు
  • అత్యాచారం చేస్తూనే రూ. 16 లక్షలు గుంజిన వైనం
  • అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన పోలీసులు
విజయవాడలో దారుణం జరిగింది. ఓ మహిళ స్నానం చేస్తుండగా రహస్యంగా ఫొటోలు తీసిన ఓ వ్యక్తి వాటిని ఆమెకు చూపించి బెదిరించాడు. ఆపై లక్షల్లో డబ్బులు గుంజుతూ ఏడాదిగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి వేధింపులు మరీ ఎక్కువ కావడంతో తాజాగా ఆమె పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని కటకటాల వెనక్కి పంపారు. 

పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని విశాలాంధ్ర కాలనీకి చెందిన పుట్టా సుభాష్ (45) బీపీసీఎల్ కంపెనీలో పైపులైన్ సెట్టింగ్ చేసే కార్మికుడు. రాజీవ్‌నగర్‌కు చెందిన ఓ మహిళ (35) శాంతినగర్‌లో భర్తతో కలిసి చిన్న కిరాణం దుకాణం నిర్వహిస్తోంది. పలుమార్లు ఆ దుకాణంలో సరుకులు కొనుగోలు చేసిన సుభాష్ పేటీఎం ద్వారా డబ్బులు చెల్లించాడు. ఈ క్రమంలో ఆమె నంబరు తెలుసుకున్నాడు. ఈ క్రమంలో ఓ రోజు ఆమె స్నానం చేస్తుండగా దొంగచాటుగా ఫొటోలు తీశాడు.

ఆపై వాటిని ఆమెకు చూపించి బెదిరించడం మొదలుపెట్టాడు. తన మాట వినకపోతే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కూడా ఆమెను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగకుండా రూ. 16 లక్షల నగదు తీసుకున్నాడు. ఆ సొమ్మును తిరిగి ఇవ్వాలని అడిగినందుకు ఆమెపై దాడిచేశాడు. ఏడాదిగా ఆమెపై అత్యాచారం చేస్తుండడంతోపాటు ఇటీవల అతడి ఆగడాలు మితిమీరడంతో కుటుంబ సభ్యులతో కలిసి సుభాష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని నిన్న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Vijayawada
Crime News
Andhra Pradesh

More Telugu News