AP Secretariat Employees Association: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘంతో ముగిసిన మంత్రి బొత్స చర్చలు

  • మీడియాతో మాట్లాడిన ఉద్యోగుల సంఘం నేత
  • 94 అంశాలు ప్రభుత్వానికి నివేదించామన్న వెంకట్రామిరెడ్డి
  • కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఆమోదించారని వెల్లడి
Botsa held talks with AP Secretariat Employees Association

ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలతో మంత్రి బొత్స సత్యనారాయణ చర్చలు ముగిశాయి. అనంతరం సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. 94 ఆర్థిక, ఆర్థికేతర అంశాలను ప్రభుత్వానికి నివేదించామని వెల్లడించారు. ఇప్పటివరకు వాటిలో 24 అంశాలు పరిష్కృతం అయ్యాయని తెలిపారు. 

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అంగీకారం లభించిందని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. పదేళ్ల సర్వీసు దాటిన ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సమ్మతి తెలిపారని, 13 వేలమందిని రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారని వివరించారు. పెండింగ్ లో ఉన్న 2 డీఏలు త్వరలో ఇస్తామని చెప్పారని వెల్లడించారు. 

సీపీఎస్ పైనా త్వరలోనే నిర్ణయం ఉంటుందని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. సీపీఎస్ ఉద్యోగులపై నమోదైన కేసుల మాఫీకి అంగీకారం లభించిందని తెలిపారు. గ్రామ/వార్డు సచివాలయం ఉద్యోగుల బదిలీకి అంగీకారం తెలిపారని వివరించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరామని వెంకట్రామిరెడ్డి చెప్పారు. 

ఈ ప్రభుత్వంలో ఉద్యోగ సంఘాల నేతలపై ఒక్క ఏసీబీ కేసు కూడా లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వాధినేత సీఎం కాబట్టి, తాను సీఎం జగన్ కు బంటునే అని వెంకట్రామిరెడ్డి ఉద్ఘాటించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తున్న ప్రభుత్వం ఇది అని కొనియాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని మనవి చేస్తున్నట్టు తెలిపారు.

More Telugu News