Nithyananda Swamy: ​​ఇంతకీ నిత్యానంద చెబుతున్న కైలాస దేశం ఎక్కడుంది?​​

Is Nithynanada Kailasa country else where existed
  • స్వామి నిత్యానందపై 2019లో అత్యాచార ఆరోపణలు
  • నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
  • దేశం విడిచి పారిపోయిన వైనం
  • కైలాస దేశం స్థాపించానంటూ ప్రకటన
  • తాజాగా ఐరాసలో ప్రత్యక్షమైన కైలాస దేశ ప్రతినిధులు
అత్యాచార ఆరోపణలతో విదేశాలకు పారిపోయిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానంద కైలాస దేశాన్ని ఏర్పాటు చేశానంటూ అప్పట్లో ప్రకటించడం తెలిసిందే. తాజాగా ఐక్యరాజ్యసమితి సదస్సులో కైలాస దేశ ప్రతినిధులుగా కొందరు మహిళలు పాల్గొనడంతో, నిత్యానంద వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. 

అయితే కైలాస దేశం నిజంగానే ఉందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈక్వెడార్ ప్రభుత్వ వ్యాఖ్యలు కొంతమేర సందేహ నివృత్తి చేస్తున్నాయి. గతంలో ఈక్వెడార్ దేశం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నిత్యానందకు తాము ఎలాంటి ఆశ్రయం ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఆయనకు ఏ దీవిని విక్రయించలేదని తేల్చి చెప్పింది. దాంతో, ఈ కైలాస దేశం ప్రపంచ పటంలో ఎక్కడుందన్నది చర్చనీయాంశంగా మారింది. 

నిత్యానంద అసలు పేరు అరుణాచలం రాజశేఖరన్. తమిళనాడులోని తిరువణ్ణామలైలో జన్మించాడు. ఎంతో వాక్చాతుర్యం కలిగిన రాజశేఖరన్ కాలక్రమంగా నిత్యానంద స్వామిగా అవతారం ఎత్తి 2003లో కర్ణాటకలోని బిడదిలో ఆశ్రమం స్థాపించాడు. మహావతార్ బాబాజీ తనకు నిత్యానందగా నామకరణం చేశాడని చెప్పుకునేవాడు. 

తనకు 12 ఏటనే జ్ఞానోదయం అయిందంటూ భక్తులకు చెప్పేవాడు. ఈయన ప్రవచనాలకు భారతీయులే కాదు, విదేశీయులు సైతం ఆకర్షితులయ్యారంటే ఎంత మాటకారో అర్థం చేసుకోవచ్చు. ఇక, నిత్యానందపై ఎన్నో వివాదాలు ఉన్నాయి. 

నిత్యానంద ఓ నటితో అభ్యంతరకర రీతిలో ఉన్న వీడియో 2010లో సంచలనం సృష్టించింది. ఈ వీడియోపై నిత్యానంద నమ్మశక్యంకాని వాదనలు వినిపించాడు. ఆ వీడియోలో తాము శవాసనం సాధన చేస్తున్నామని వివరణ ఇచ్చాడు. కనీసం ఒక్కరైనా ఆయన మాటలు నమ్మారన్నది అనుమానమే.

ఆ తర్వాత 2019లో నిత్యానందపై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. తన ఆశ్రమంలో మైనర్ బాలికలను నిర్బంధించి, వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఆయనపై కేసు నమోదైంది. నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ కావడంతో నిత్యానంద దేశం విడిచి పారిపోయాడు. అప్పటి నుంచి విదేశాల్లోనే తలదాచుకుంటున్నాడు. 

కొన్నాళ్ల కిందట యునైటెడ్ స్టేట్ ఆఫ్ కైలాస అంటూ తానొక దేశాన్ని ఏర్పాటు చేశానని ప్రకటించుకున్నాడు. ఈ దేశానికి రిషభ ధ్వజం అధికారిక జెండా అని, జాతీయ జంతువుగా నంది, జాతీయ పుష్పంగా కమలం, జాతీయ చెట్టుగా మర్రి చెట్టును ప్రకటించారు. అంతేకాదు, ఇంగ్లీషు, తమిళం, సంస్కృత భాషలను అధికారిక భాషలుగా పేర్కొన్నారు. 

పైగా కైలాస దేశానికి రిజర్వ్ బ్యాంకు కూడా ఉందని, సొంత కరెన్సీకి రూపకల్పన చేశామని నిత్యానంద స్వామి వెల్లడించారు. ప్రపంచంలో ఎవరైనా స్వేచ్ఛగా హిందూ మతాన్ని అవలంబించాలనుకుంటే తమ కైలాస దేశానికి రావొచ్చని ఆయన ఆహ్వానం పలికారు.
Nithyananda Swamy
Kaialasa
Country
India

More Telugu News