Team India: రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 163 ఆలౌట్... ఆసీస్ లక్ష్యం 76 పరుగులు

  • ఇండోర్ టెస్టులో ముగిసిన రెండో రోజు ఆట
  • 8 వికెట్లు తీసిన లైయన్
  • అర్ధ సెంచరీతో పుజారా వీరోచిత పోరాటం 
  • ఇక టీమిండియా ఆశలన్నీ బౌలర్లపైనే!
Team India all out for 163 runs in 2nd innings

ఇండోర్ టెస్టులో టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ లో 163 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో ఆసీస్ ముందు 76 పరుగుల విజయలక్ష్యం నిలిచింది. ఇంకెక్కడైనా అయితే ఇది చాలా ఈజీ టార్గెట్టే. కానీ ఇండోర్ పిచ్ లో బంతి సుడులు తిరుగుతుండడంతో బ్యాటింగ్ అత్యంత కష్టసాధ్యంగా మారింది. నిన్నటితో పోల్చితే ఇవాళ పిచ్ పై టర్న్ మరీ ఎక్కువగా ఉంది. ఈ ఉదయం సెషన్లో ఆస్ట్రేలియా 11 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోవడం అందుకు నిదర్శనం. 

ఇవాళ రెండో రోజు ఆట ముగియగా... రేపు రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్న ఆస్ట్రేలియాకు అగ్నిపరీక్ష తప్పేలా లేదు. 76 పరుగుల లక్ష్యం చిన్నదే అయినా, నిప్పుల కుంపటిని తలపిస్తున్న పిచ్ పై భారత స్పిన్నర్లను కంగారూలు ఏ విధంగా ఎదుర్కొంటున్నారన్నది ఆసక్తి కలిగిస్తోంది. 

నేడు రెండో ఇన్నింగ్స్ ఆడిన భారత్... ప్రతికూలంగా మారిన పిచ్ పై అద్భుతపోరాటం సాగించిందనే చెప్పాలి. ముఖ్యంగా, ఛటేశ్వర్ పుజారా ఆట గురించి ఎంత చెప్పినా తక్కువే. బంతి ఎలా వస్తుందో ఏమాత్రం అంచనా వేయలేని ఈ పిచ్ పై ఎంతో ఓపిగ్గా ఆడిన పుజారా అర్ధసెంచరీ సాధించాడు. పుజారా 142 బంతుల్లో 59 పరుగులు చేసి ఎనిమిదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. పుజారా స్కోరులో 5 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. 

ఇక శ్రేయాస్ అయ్యర్ (26), రవిచంద్రన్ అశ్విన్ (16), అక్షర్ పటేల్ (15 నాటౌట్) ఆసీస్ స్పిన్ దాడులను తీవ్రంగా ప్రతిఘటించి విలువైన పరుగులు జోడించారు. కోహ్లీ 13, రోహిత్ శర్మ 12 పరుగులు చేయగా... గిల్ 5, జడేజా 7 పరుగులకు అవుటయ్యారు. 

ఆస్ట్రేలియా సీనియర్ స్పిన్నర్ నాథన్ లైయన్ 8 వికెట్లు పడగొట్టడం హైలైట్. మిచెల్ స్టార్క్ 1, కుహ్నెమన్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులు చేయగా, ఆసీస్ 197 పరుగులు చేయడం తెలిసిందే.

More Telugu News