Cricket: కపిల్ దేవ్​ రికార్డు సమం చేసిన జడేజా

  • 500 వికెట్లు, 5 వేల పరుగులు చేసిన రెండో క్రికెటర్ గా జడేజా
  • ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో ఈ ఘనత సాధించిన జడ్డూ
  • భారత్ తరఫున తొలుత ఈ రికార్డు అందుకున్న కపిల్ దేవ్
Ravindra Jadeja equals Kapil dev record

అన్ని ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన చేస్తున్న భారత జట్టు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 500 వికెట్లు పడగొట్టి, 5 వేల పరుగులు చేసిన భారత రెండో క్రికెటర్‌ జడేజా రికార్డు సృష్టించాడు. దిగ్గజ క్రికెటర్ కపిల్‌ దేవ్‌ సరసన నిలిచాడు. ఇండోర్ లో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ వికెట్‌ పడగొట్టడం ద్వారా అతను ఈ ఘనత సాధించాడు. టెస్టుల్లో జడేజాకు ఇది 260వ వికెట్‌. దాంతో, మూడు ఫార్మాట్లలో కలిపి అతను 500 వికెట్ల క్లబ్‌లో చేరాడు. 

వన్డేల్లో 189 వికెట్లు తీసిన రవీంద్ర టీ20ల్లో మరో 51 వికెట్లు ఖతాలో వేసుకున్నాడు. బ్యాట్ తోనూ అతను అద్భుతాలు చేస్తున్నాడు. టెస్టు ఫార్మాట్ లో ఇప్పటిదాకా 2,619 పరుగులు చేసిన అతను వన్డేల్లో 2,447 సాధించాడు. టీ20ల్లో 457 పరుగులు చేశాడు. 1983లో భారత్ కు ప్రపంచ కప్ అందించిన కపిల్‌ దేవ్‌ తొలుత ఈ ఘనత సాధించాడు. తన కెరీర్ లో కపిల్ 687 వికెట్లు పడగొట్టాడు. అందులో టెస్టుల్లో 434 ఉండగా, వన్డేల్లో 253 వికెట్లు ఉన్నాయి. ఇక, టెస్టుల్లో 5,248 పరుగులు సాధించిన కపిల్..  తన వన్డే కెరీర్లో 3,783 పరుగులు చేశాడు.

More Telugu News