KTR: మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మంచి గిఫ్టే ఇచ్చారు: గ్యాస్ ధరలపై కేటీఆర్ సెటైర్లు

  • ఎన్నికలు పూర్తి కాగానే గ్యాస్‌, పెట్రోల్‌ ధరలు పెంచడం మోదీ ప్రభుత్వానికి అలవాటైందన్న కేటీఆర్‌
  • ఎల్పీజీ ధరల పెంపుపై రేపు ఆందోళనలు చేపట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపు
  • ఢిల్లీకి వినిపించేలా గళమెత్తాలని సూచన
telangana minister ktr slams union government over gas price hike

గ్యాస్‌ సిలిండర్ల ధరలను పెంచడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నల్లధనం బయటికి తీయడమేమో గానీ.. పోపు డబ్బాల్లో మహిళలు దాచుకున్న డబ్బును మాత్రం మోదీ బయటికి తీయిస్తున్నారని విమర్శించారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మంచి గిఫ్టే ఇచ్చారంటూ మోదీపై సెటైర్లు వేశారు. 

ఎల్పీజీ ధరల పెంపును వ్యతిరేకిస్తూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. నియోజకవర్గ, పట్టణ, మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. పెంచిన గ్యాస్‌ ధరలపై ఢిల్లీకి వినిపించేలా గళమెత్తాలని చెప్పారు. కేంద్రాన్ని నిలదీస్తూ వినూత్నంగా నిరసనలు తెలపాలన్నారు. 

ఎన్నికలు అయిపోగానే గ్యాస్‌, పెట్రోల్‌ ధరలు పెంచడం మోదీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని కేటీఆర్‌ ఆరోపించారు. త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ ఎన్నికలు ముగియగానే ఎల్పీజీ ధరలు పెంచేశారంటూ మండిపడ్డారు. గృహావసరాల సిలిండర్ ధరను రూ.50, కమర్షియల్‌ సిలిండర్‌ ధరను రూ.350 పెంచడం దారుణమన్నారు. మోదీ ప్రభుత్వం రాకముందు ఎల్పీజీ సిలిండర్‌ ధర 400 ఉంటే ఇప్పుడు 1,200కు చేరిందని గుర్తుచేశారు.

ఒకవైపు ఉజ్వల స్కీమ్‌ పేరుతో మాయ మాటలు చెబుతూ.. మరోవైపు భారీగా గ్యాస్‌ ధరలు పెంచడం వెనక అసలు ఉద్దేశం ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. పేదలు, సామాన్యులకు గ్యాస్‌ను దూరం చేయడమే మోదీ సర్కార్‌ లక్ష్యమా? అని నిలదీశారు. అడ్డగోలుగా పెంచిన గ్యాస్‌ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.

More Telugu News