Supreme Court: కేంద్ర ప్రభుత్వానికి షాక్.. ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియపై కీలక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు

  • ఈసీల నియామకాలకు ప్యానల్ ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు
  • ప్యానల్ లో పీఎం, ప్రధాన ప్రతిపక్ష నేత, సీజేఐ ఉండాలని తీర్పు
  • ఎన్నికలను స్వచ్ఛంగా నిర్వహించకపోతే వినాశకర పరిణామాలకు దారి తీస్తుందని వ్యాఖ్య
Supreme Court key order on Election Commissioners appointment

చీఫ్ ఎలెక్షన్ కమిషనర్, ఈసీల నియామకానికి సంబంధించి ఐదుగురు జడ్జిల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ కోసం ఒక పానెల్ ను ఏర్పాటు చేయాలని... ఈ ప్యానెల్ లో ప్రధానమంత్రి, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలని తెలిపింది. ఎన్నికలు సక్రమంగా జరగాలంటే ఈసీల నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని పేర్కొంది. కేంద్ర ఎన్నికల సంఘంలోని చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ తో పాటు మరో ఇద్దరు ఎలెక్షన్ కమిషనర్లను ఈ ప్యానల్ సలహా మేరకే తీసుకోవాలని తెలిపింది. దీనివల్ల వీరి నియామక ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వంతో పాటు, ప్రధాన ప్రతిపక్షం, న్యాయ వ్యవస్థల ప్రమేయం కూడా ఉన్నట్టుంటుందని వ్యాఖ్యానించింది. 

ఎన్నికలను నిర్వహించడంలో పారదర్శకంగా వ్యవహరించాలని, స్వచ్ఛమైన ఎన్నికలను నిర్వహించడమే ఎలెక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లక్ష్యమని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల సరళి స్వచ్ఛంగా లేకపోతే అది వినాశకరమైన పరిణామాలకు దారి తీస్తుందని పేర్కొంది. 

కేంద్ర ఎన్నికల సంఘానికి స్వతంత్ర సచివాలయం, నిర్ణయాధికారాలు, సొంత బడ్జెట్, అభిశంసన నుంచి రక్షణ ఉండాలని సుప్రీంకోర్టు తెలిపింది. నిధుల కోసం ఇప్పటి వరకు ప్రధాని కార్యాలయం, కేంద్ర న్యాయశాఖ కార్యాలయానికి కేంద్ర ఎన్నికల సంఘం వెళ్లాల్సి వచ్చేది. సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పుడు నేరుగా భారతదేశ ఏకీకృత నిధి నుంచి డ్రా చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.  

ప్రస్తుతం ప్రధానమంత్రి రెకమెండేషన్ తో చీఫ్ ఎలెక్షన్ కమిషనర్, ఇద్దరు ఎలెక్షన్ కమిషనర్లుగా మాజీ ఐఏఎస్ అధికారులను గరిష్ఠంగా ఆరేళ్ల కాలపరిమితితో భారత రాష్ట్రపతి నియమిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం వారికి అనుకూలమైన వారిని ఎలెక్షన్ కమిషనర్లుగా నియమిస్తోందని... దీన్ని అరికట్టేందుకు ఈసీల నియామకాలకు కొలీజియం వ్యవస్థను ఏర్పాటు చేయాలని సుప్రీంలో పిటిషన్ దాఖలయింది. అరుణ్ గోయల్ ను ఈసీగా నియమించడాన్ని తప్పుపడుతూ ఈ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు కీలక తీర్పును వెలువరించింది. తద్వారా ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదనే కేంద్ర ప్రభుత్వ వాదనకు చెక్ పెట్టింది. 

అరుణ్ గోయల్ 1985 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. నవంబర్ 19న ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. నవంబర్ 18న ఆయనను ఎలెక్షన్ కమిషనర్ గా నియమించారు. ఈసీగా ఆయన నవంబర్ 21న బాధ్యతలను స్వీకరించారు. ఈ నియామకంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్ర ప్రభుత్వం తనకు అనుకూలమైన వ్యక్తిని కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఈసీగా నియమించిందని విపక్షాలు మండిపడ్డాయి.

More Telugu News