Supreme Court: సర్వత్ర ఉత్కంఠ.. ఎన్నికల కమిషనర్లను నియమించే ప్రక్రియపై కీలక తీర్పును వెలువరించనున్న సుప్రీంకోర్టు

  • వ్యక్తిగత సానుకూలతల మేరకు ఎన్నికల కమిషనర్లను కేంద్ర ప్రభుత్వాలు నియమిస్తున్నాయని పిటిషన్
  • ఈసీల నియామకాలకు కొలీజియం ఏర్పాటు చేయాలని విన్నపం
  • తీర్పును వెలువరించనున్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం
Supreme Court To Deliver Verdict On Appointment System Of Election Commissioners

ప్రస్తుతం ఎన్నికల కమిషనర్లను నియమిస్తున్న విధానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈరోజు కీలక తీర్పును వెలువరించే అవకాశం ఉంది. జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ సీటీ రవికుమార్, జస్టిస్ అనిరుద్ధ బోస్ లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించనుంది.   

ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు, ఈసీలను కేంద్ర ప్రభుత్వాలు వాటి అభిమతం మేరకు, సానుకూలతల మేరకు నియమిస్తున్నాయని పిటిషనర్ ఆరోపించారు. ఎన్నికల కమిషనర్లను నియమించేందుకు స్వతంత్ర కొలీజియంను ఏర్పాటు చేయాలని కోరారు.

మరోవైపు జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం... అరుణ్ గోయల్ ను ఎలక్షన్ కమిషనర్ గా నియమించడంపై అటార్నీ జనరల్ ఆర్.వెంటకరమణికి పలు ప్రశ్నలను సంధించింది. అరుణ్ గోయల్ పేరును 24 గంటల్లోనే ఖరారు చేసేందుకు ఏ నిబంధనలను పాటించారని ప్రశ్నించింది. అదే రోజున క్లియరెన్స్ ఎలా ఇచ్చారని, అదే రోజున పూర్తి వ్యవహారాన్ని ఎలా ముగించారని, 24 గంటల్లోగానే ఆయనను ఎలా అపాయింట్ చేశారని నిలదీసింది. 

మరోవైపు ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ అంశంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ అంశంలో ఎలాంటి తీర్పును వెలువరించనుందనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది.

More Telugu News