vehicle insurence: వాహన బీమా లేకుండా పట్టుబడితే అక్కడికక్కడే బీమా!.. ప్రణాళికలు రూపొందిస్తున్న కేంద్ర ప్రభుత్వం

  • త్వరలో అమలులోకి తీసుకురానున్న ప్రభుత్వం
  • బీమా లేని వాహనాలను గుర్తించేందుకు ప్రత్యేక పరికరం
  • ఫాస్ట్ ట్యాగ్ లో నుంచి బీమా ప్రీమియం వసూలు
Government is planning to offer on the spot insurance cover to uninsured vehicles

వాహన బీమా విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న యజమానులకు కేంద్రం షాక్ ఇవ్వనుంది. బీమా లేని వాహనంతో రోడ్డుపైకి వస్తే అక్కడికక్కడే ఇన్సూరెన్స్ చేయించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రణాళికలను రూపొందిస్తోంది. దేశంలో పెరుగుతున్న వాహనాల సంఖ్య, నిబంధనల ఉల్లంఘనలు కూడా పెరుగుతున్నాయి. ఇన్సూరెన్స్ లేకపోవడంతో ప్రమాదాలు జరిగిన సందర్భాలలో థర్డ్ పార్టీకి పరిహారం అందించే వీలు లేకుండా పోతోంది. ఈ క్రమంలో ఇన్సూరెన్స్ లేకుండా పట్టుబడిన వాహనాలకు అక్కడికక్కడే, అప్పటికప్పుడే బీమా చేయించాలని కేంద్రం భావిస్తోంది.

ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లపై పలు విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇన్సూరెన్స్ లేని వాహనాల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వానికి జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ పలు సూచనలు చేసింది. ముఖ్యంగా జాతీయ రహదారులపై తిరిగే వాహనాలకు కచ్చితంగా బీమా ఉండేలా చూడాలని కేంద్ర రవాణా శాఖకు కౌన్సిల్ సూచించింది. ఇలాంటి వాహనాలను గుర్తించేందుకు కొత్త రకం పరికరాన్ని ఉపయోగించాలని సిఫార్సు చేసింది.

ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బులను సదరు వాహన యజమాని ఫాస్ట్ ట్యాగ్ నుంచి మినహాయించుకునేలా ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. ఇందుకోసం ఫాస్ట్ ట్యాగ్ ప్లాట్ ఫారమ్ ను ఉపయోగించుకునేందుకు బీమా కంపెనీలకు అనుమతినివ్వాలని జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ సూచించింది. ఈ సూచనలపై మార్చి 17న జరిగే సమావేశంలో తుది నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.

More Telugu News