Delhi Liquor Scam: మంత్రి పదవికి సిసోడియా రాజీనామా

  • నిర్దోషిగా తేలేవరకూ పదవులకు దూరంగా ఉంటానని ప్రకటన
  • ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు మూడు పేజీల లేఖ రాసిన నేత
  • ఇప్పటికే జైలులో ఉన్న సత్యేంద్ర జైన్ కూడా రాజీనామా
  • ఢిల్లీ కేబినెట్ లో ఇద్దరు కొత్తవారికి చోటు!
Delhi ministers sisodia and satyendra jain resigned

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన మనీశ్ సిసోడియా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. విచారణ పూర్తయి నిర్దోషిగా తేలేవరకూ పదవులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. తనపై మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధమని, నిజమేమిటో దేవుడికి తెలుసని సిసోడియా చెప్పారు.

ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కు ఈమేరకు మంగళవారం సాయంత్రం మూడు పేజీల లేఖ రాశారు. ఢిల్లీ సర్కారులో, ఆమ్ ఆద్మీ పార్టీలో కేజ్రీవాల్ తర్వాత సిసోడియానే కీలకంగా వ్యవహరిస్తున్నారు. రాజీనామాకు ముందు వరకూ ఆయన ఢిల్లీ ప్రభుత్వంలోని 18 శాఖలకు ఇంచార్జిగా వ్యవహరించారు. తాజాగా ఈ బాధ్యతలకు సిసోడియా రాజీనామా చేశారు.

సిసోడియాతో పాటు మనీలాండరింగ్ కేసులో గత పది నెలలుగా జైలులో ఉన్న ఢిల్లీ మినిస్టర్, ఆప్ నేత సత్యేంద్ర జైన్ కూడా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. వీరిద్దరి రాజీనామాను ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆమోదించినట్లు ఆప్ వర్గాలు తెలిపాయి. అయితే, రాజీనామా చేయడమంటే నేరాన్ని అంగీకరించడం కాదని ఈ సందర్భంగా ఆప్ నేతలు స్పష్టం చేశారు.

సిసోడియా ఆధ్వర్యంలో ఉన్న విద్య, వైద్యారోగ్యం సహా పలు కీలక శాఖలను తాత్కాలికంగా ఆప్ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ కు కేజ్రీవాల్ అప్పగించారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ కేబినెట్ లో కేజ్రీవాల్ ఇద్దరు కొత్త వారికి అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. మంత్రుల రాజీనామాలను ఆమోదించిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వాటిని లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు పంపించారు. అక్కడి నుంచి వాటిని తుది ఆమోదం కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపుతారు.

More Telugu News