Bhadrachalam: భద్రాద్రిలో శ్రీరామ నవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు.. నేటి నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు

  • ఈ నెల 22 నుంచి ఏప్రిల్ 5 వరకు బ్రహ్మోత్సవాలు
  • రూ. 150 నుంచి రూ. 7500 వరకు టికెట్లు
  • రూ.7500 టికెట్‌పై ఇద్దరికి ప్రవేశం
  • ఈ నెల 31న శ్రీరామ రాజ్య పట్టాభిషేకం
Bhadrachalam Sri Rama Navami Tickets Sells From Today Through Online

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీరామ నవమి కల్యాణ బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది. ఈ నెల 22 నుంచి ఏప్రిల్ 5 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ నెల 30న ఆలయ సమీపంలోని మిథిలా మండపంలో కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ వేడుకను భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన టికెట్లను నేటి నుంచి ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు. వీటిలో రూ. 7,500, రూ. 2500, రూ. 2000, రూ. 1000, రూ. 300, రూ. 150 టికెట్లు ఉంటాయని, రూ. 7,500 టికెట్‌పై ఇద్దరికి ప్రవేశం కల్పించి స్వామివారి ప్రసాదం అందజేయనున్నట్టు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. మిగతా టికెట్లపై ఒకరినే అనుమతిస్తారు. టికెట్లు కొనుగోలు చేసిన 16,860 మంది మండపం నుంచి, స్టేడియం నుంచి 15 వేల మంది ఉచితంగా కల్యాణ్యాన్ని వీక్షించవచ్చని రమాదేవి తెలిపారు. 

ఇక, రూ. 7,500 టికెట్లను ఆన్‌లైన్‌తోపాటు ఆలయ కార్యాలయంలోనూ విక్రయించనున్నారు. అలాగే, మార్చి 31న నిర్వహించే శ్రీరామ రాజ్య పట్టాభిషేకానికి కూడా నేటి నుంచే టికెట్లు విక్రయించనున్నారు. టికెట్ల కోసం www.bhadrachalamonline.comను సంప్రదించవచ్చు.

More Telugu News