Narayana: మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు

  • అమరావతి భూముల వ్యవహారంలో నోటీసులు
  • నారాయణ కుమార్తెలకు కూడా సీఐడీ నోటీసులు
  • విచారణకు రావాలంటూ స్పష్టీకరణ
  • ఇటీవల నారాయణ, ఆయన కుమార్తెల నివాసాల్లో సోదాలు
CID issues notice to former minister Narayana

రాజధాని భూముల వ్యవహారంలో మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ 41ఏ కింద ఈ నోటీసులు ఇచ్చింది. మార్చి 6న విచారణకు రావాలంటూ స్పష్టం చేసింది. 

నారాయణతో పాటు రామకృష్ణ హౌసింగ్ ఎండీ అంజనీకుమార్ కు కూడా సీఐడీ నోటీసులు జారీ చేసింది. అంతేకాదు, నారాయణ కుమార్తెలు సింధూర, శరణి, ఉద్యోగి ప్రమీలకు కూడా నోటీసులు పంపింది. నారాయణ కుమార్తెలు మార్చి 7న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. 

అమరావతి భూముల కొనుగోలుకు సంబంధించి ఇటీవల సీఐడీ అధికారులు నారాయణ, ఆయన కుమార్తెల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. నారాయణ తన సంస్థ ఉద్యోగుల పేరు మీద కూడా భూములు కొన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 148 ఎకరాల అసైన్డ్ భూమిని కొనుగోలు చేసి, తనకు కావల్సిన వారికి అనుకూలంగా అమరావతి మాస్టర్ ప్లాన్ అలైన్ మెంట్ డిజైన్ మార్చినట్టు నారాయణపై ప్రధాన ఆరోపణ ఉంది. 

అమరావతి ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా నారాయణ అసైన్డ్ భూములు కొనుగోలు చేశారంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ 2020లో కేసు నమోదు చేసింది.

More Telugu News