small finance banks: ఫిక్స్ డ్ డిపాజిట్లపై 9 శాతానికి చేరిన వడ్డీ రేట్లు

  • ప్రధాన వాణిజ్య బ్యాంకుల్లో 7 శాతం వరకు రేట్లు
  • స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో గరిష్ఠంగా 9 శాతం
  • ఏ బ్యాంకు అయినా రూ.5 లక్షల వరకు డిపాజిట్ పై బీమా రక్షణ
small finance banks offered highest interest rates on fixed deposits

ఆర్ బీఐ వరుసగా కీలక రెపో రేటును పెంచుతూ వస్తుండడం బ్యాంకు డిపాజిట్లను ఆకర్షణీయంగా మార్చేసింది. గతేడాది మే నుంచి ఇప్పటి వరకు ఆర్ బీఐ రెపో రేటును 2.50 శాతం పెంచింది. బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ఈ రేటే కీలకంగా పనిచేస్తుంది. అంతేకాదు, ఫిక్స్ డ్ డిపాజిట్ల రేట్లు సైతం రెపో రేటు ఆధారంగా చలిస్తుంటాయి. ప్రముఖ వాణిజ్య బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 7 శాతంగా ఉంటే, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు గరిష్ఠంగా 9 శాతం వరకు ఆఫర్ చేస్తున్నాయి. ఆర్ బీఐ కింద పనిచేసే అన్ని బ్యాంకుల్లోనూ ఒక్కో కస్టమర్ కు ఒక బ్యాంకు పరిధిలో రూ.5 లక్షల డిపాజిట్ కు రక్షణ ఉంటుంది. బ్యాంకు మునిగిపోతే ఆర్ బీఐ ఆ మేరకు చెల్లింపులు చేస్తుంది. 

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
వివిధ కాల వ్యవధి కలిగిన ఎఫ్ డీలపై 4.50-9 శాతం మధ్య రేట్లు అమల్లో ఉన్నాయి. సీనియర్ సిటిజన్లకు అయితే అర శాతం అధిక రేటు లభిస్తుంది. అంటే గరిష్ఠంగా 9.50 శాతం రేటుకు ఎఫ్ డీ చేసుకోవచ్చు. 1001 రోజుల డిపాజిట్ పై ఈ రేటు అమల్లో ఉంది.

ఇసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఈ బ్యాంక్ 4.50 శాతం నుంచి గరిష్ఠంగా 8.10 శాతం వరకు ఎఫ్ డీలపై రేట్లను అమలు చేస్తోంది. సీనియర్ సిటిజన్లకు అర శాతం అదనపు రేటు లభిస్తుంది. 999 రోజుల డిపాజిట్ పై 8.10 శాతం అమల్లో ఉంది.

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఈ బ్యాంక్ 3.75 శాతం నుంచి 8.10 శాతం వరకు వివిధ కాల వ్యవధి డిపాజిట్లపై రేట్లను ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లకు అరశాతం అధిక రేటు లభిస్తుంది.

ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు కనిష్ఠంగా 3 శాతం (ఏడు రోజుల డిపాజిట్), గరిష్ఠంగా 8.11 శాతం (750 రోజుల డిపాజిట్) రేటును ఎఫ్ డీలపై ఆఫర్ చేస్తోంది.

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఈ బ్యాంకులో డిపాజిట్లపై వడ్డీ రేట్లు 3.75 శాతం నుంచి 8 శాతం వరకు అమల్లో ఉన్నాయి. 560 రోజుల డిపాజిట్ పై 8 శాతం రేటు పొందొచ్చు. సీనియర్ సిటిజన్లకు ఇదే డిపాజిట్ పై 8.75 శాతం రేటును ఆఫర్ చేస్తోంది.

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
4 శాతం నుంచి 8 శాతం మధ్య రేట్లు అమల్లో ఉన్నాయి. సీనియర్ సిటిజన్లకు 0.75 శాతం అధిక రేటును ఆఫర్ చేస్తోంది. 700 రోజుల డిపాజిట్ పై సాధారణ కస్టమర్లు 8 శాతం, 60 ఏళ్లు నిండిన వారు 8.75 శాతం రేటును పొందొచ్చు.

సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
4.5 శాతం నుంచి 8.51 శాతం మధ్య రేట్లు అమల్లో ఉన్నాయి. సీనియర్ సిటిజన్లకు పావు శాతం అధిక రేటును ఇస్తోంది.

More Telugu News