YSR Rythu Bharosa: రాష్ట్రంలో రాజకీయ యుద్ధం జరుగుతోంది: వైఎస్ జగన్

cm jagan release financial assistance to the farmers ysr rythu bharosa
  • రైతులను వంచించిన చంద్రబాబు ఒకవైపు.. రైతులకు అండగా ఉంటున్న వైసీపీ ఇంకోవైపు ఉందన్న జగన్
  • గజదొంగల ముఠాలో దత్తపుత్రుడు ఉన్నాడని ఆరోపణ
  • వీరిది దోచుకో.. పంచుకో.. తినుకో స్కీమ్ అని ఎద్దేవా
  • రైతు భరోసా పథకం కింద రూ.1,090 కోట్ల విడుదల
రాష్ట్రంలో రాజకీయ యుద్ధం జరుగుతోందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. పేద వాడు ఒకవైపు, పెత్తందారులు మరోవైపు ఉన్నారని చెప్పారు. కుట్రలను, అన్యాయాలను గమనించాలని, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రజలను కోరారు. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అన్న దాన్ని ప్రామాణికంగా చేసుకుని నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

రైతులకు మూడో విడత రైతు భరోసా నిధులను సీఎం జగన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా తెనాలిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ‘‘చంద్రబాబుది పెత్తందార్ల పార్టీ. మనది పేదల ప్రభుత్వం.. రైతన్న ప్రభుత్వం. రైతులను వంచించిన చంద్రబాబు ఒకవైపు.. రైతులకు అండగా ఉంటున్న వైసీపీ ఇంకోవైపు ఉంది. కరవుతో స్నేహం ఉన్న చంద్రబాబు ఒక వైపు.. వరుణ దేవుడి ఆశీస్సులు ఉన్న మన ప్రభుత్వం ఇంకో వైపు ఉంది’’ అని అన్నారు. 

గ్రామాల్లో జన్మభూమి కమిటీల గజదొంగల ముఠా ఉందని, పైస్థాయిలో రామోజీరావు, ఆంధ్రజోతి, టీవీ 5 గజదొంగల ముఠా ఉందని, ఇందులో ఇంకొకరు ఆ దత్తపుత్రుడు అని జగన్ విమర్శించారు. వీరిది డీపీటీ స్కీమ్ అని.. దాని అర్థం దోచుకో.. పంచుకో.. తినుకో అని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదని, క్లాస్ వార్ జరుగుతోందని అన్నారు. 

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని జగన్ చెప్పారు. రాష్ట్రంలో అర కోటికి పైగా రైతు కుటుంబాలకు మంచి జరుగుతోందని అన్నారు. రైతు భరోసా కింద ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని జగన్ తెలిపారు. కానీ చెప్పిన దాని కన్నా ఎక్కువే ఇస్తున్నామన్నారు. ఏటా రూ.13,500 ఇస్తున్నామని, నాలుగేళ్లను ఐదేళ్లకు పెంచామని చెప్పారు. ఐదేళ్లలో ప్రతి రైతుకు అక్షరాలా రూ.67,500 ఇచ్చేలా చర్యలు చేపట్టామన్నారు.

రెండు విడతల్లో 11,500 ఇచ్చామని, మూడో విడతగా మరో 2 వేలచొప్పున 51.12 లక్షల మంది రైతులకు ఇస్తున్నామని తెలిపారు. రూ.1,090 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లోకి వస్తాయన్నారు. ఒక్కో రైతు కుటుంబానికి రూ.54 వేల చొప్పున ఇప్పటిదాకా రైతులందరికీ కలిపి రూ.27,062 కోట్లు ఇచ్చామన్నారు.

పంట నష్టపరిహారానికి సంబందించి డిసెంబర్ లో తుపాన్ వల్ల నష్టపోయిన 91,237 మంది రైతులకు రూ.77 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని నేరుగా ఖాతాల్లోకి వేస్తున్నామని జగన్ చెప్పారు. ఇప్పటిదాకా 22.22 లక్షల మందికి 1,911 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో రెయిన్ గన్నుల్లేవని.. రైన్ మాత్రమే ఉందని జగన్ అన్నారు. ‘‘కరవు ఊసే లేదు.. 2014 నుంచి 2019 మధ్య అన్యాయస్తుడు ముఖ్యమంత్రిగా ఉండేవాడు. అప్పుడు ప్రతి ఏటా కరవే. కనీసం 300 మండలాల్లో కరవు ఉండేది. అలాంటి దుస్థితి ఇప్పుడు ఎక్కడా లేదు’’ అని చెప్పారు. ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కరవు వస్తుందన్నారు. ఇది గతాన్నిచూస్తే కనిపించే నగ్న సత్యమన్నారు. కడుపు మంటకు, అసూయకు అసలే మందు లేదని ప్రతిపక్షాలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. తర్వాత రైతు భరోసా నిధులను విడుదల చేశారు.
YSR Rythu Bharosa
Jagan
financial assistance to the farmers
YSRCP
Chandrababu
Pawan Kalyan

More Telugu News